CM Revanth Reddy: జూబ్లీహిల్స్ లో మనపై కుట్ర జరుగుతోంది.. రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

by Prasad Jukanti |

పార్లమెంట్ ఎన్నికల్లో జరిగింతే జూబ్లీహిల్స్ లో రిపీట్ కాబోతోందని సీఎం హాట్ కామెంట్స్ చేశారు.

CM Revanth Reddy: జూబ్లీహిల్స్ లో మనపై కుట్ర జరుగుతోంది.. రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో (Jubilee Hills by-election) బీఆర్ఎస్, బీజేపీలు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ పార్టీపై కుట్రలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 37 శాతం ఓట్లు సాధించిన బీఆర్ఎస్ ఆ తర్వాత నాలుగు నెలలకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 15 శాతానికి పడిపోయిందని 22 శాతం బీఆర్ఎస్ ఓట్లు ఎవరికి చేరాయి? ఎవరెవరి మధ్యలో అవగాహన ఉంది? ఎవరు ఎవరిని బలపరుస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా ఇదే తతంగాన్ని కొనసాగించాలని ఈ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని, బీసీలకు రిజర్వేషన్లు రాకపోవడానికి కూడా కారణం ఈ రెండు పార్టీలేనని ధ్వజమెత్తారు. ఈ కుట్రలన్నింటిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణను అభివృద్ధి వైపు నడిపిద్దాం అని పిలుపునిచ్చారు. ఇవాళ చార్మినార్‍ వద్ద నిర్వహించిన రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర (Rajiv Gandhi Sadbhavana Yatra) సంస్మరణ దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి జరగబోయే ఎన్నికల్లో చీలిక తీసుకురావాలని కుట్రలు జరుగుతున్నాయని ఈ కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టాలన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ (BRS) బీ టీమ్ గా మారిందని ఆరోపించారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్, చేవెళ్ల, సికింద్రాబాద్, మెదక్, మల్కాజిగిరి, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ ఎనిమిది స్థానాల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి (BJP) పడ్డాయని ఆరోపించారు.

21 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీకి రెజల్యూషన్ తీసుకువస్తాం:

దేశ భవిష్యత్తును యువతే నిర్ణయించాలని రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయసును 18 ఏళ్లకు తగ్గించారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో చట్టసభలకు పోటీ చేసే వయసును కూడా 21 ఏళ్లకు తగ్గించాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అందుకే ఎమ్మెల్యేగా పోటీచేసే అర్హత వయసును 21 ఏళ్లకు తగ్గిస్తూ త్వరలో తెలంగాణలో రెజల్యూషన్ తీసుకువస్తామని చెప్పారు. ఈ విషయంలో పార్లమెంటులో చట్టసవరణ చేస్తే రాజకీయాల్లో యువత మరింత క్రియాశీలకంగా మారుతుందని చెప్పారు.

మతతత్వవాదులు బ్రిటిషర్ల కంటే ప్రమాదకరం:

గాంధీ కుటుంబం దేశంలో శాంతి, సామరస్యత కాపాడుతోందని, మూడు తరాలుగా గాంధీ కుటుంబం దేశం కోసం పని చేస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గొప్పతనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీని హత్య చేసిన మతతత్వవాదులు బ్రిటిషర్ల కంటే ప్రమాదకరం అని హాట్ కామెంట్స్ చేశారు. దేశాన్ని విచ్చిన్నం చేయాలని కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించారని అన్నారు. రాహుల్ గాంధీని స్పూర్తిగా తీసుకుని ఎస్సీ వర్గీకరణతో పాటు కులగణన చేశామన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా రాజీవ్ గాంధీ స్పూర్తి కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాజీవ్ సద్భావన అవార్డును సల్మాన్ ఖుర్షీద్‍కు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ రెడ్డి, వీహెచ్, ఏఐసీసీ నేత సల్మాన్ ఖుర్షీద్ తదితరులు పాల్గొన్నారు.

Next Story