Teenmaar Mallanna: బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేక పిటిషన్ల వెనకు సీఎం రేవంత్ రెడ్డి: తీన్మార్ మల్లన్న

by Prasad Jukanti |

బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే తిరుగుబాటు తప్పదని తీన్మార్ మల్లన్న హెచ్చరించారు.

Teenmaar Mallanna: బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేక పిటిషన్ల వెనకు సీఎం రేవంత్ రెడ్డి: తీన్మార్ మల్లన్న
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీ రిజర్వేషన్లకు (BC Reservations) అడ్డుగా సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో దాఖలవుతున్న పిటిషన్ల వెనుక వందకు వంద శాతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఉన్నారని టీఆర్పీ పార్టీ (TRP Party) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna) సంచలన ఆరోపణలు చేశారు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను కంట్రోల్ చేయగలిగిన శక్తి రేవంత్ రెడ్డి వద్ద ఉన్నప్పుడు కోర్టుకు వెళ్లిన ఈ ఇద్దరిని కంట్రోల్ చేసే శక్తి లేదా అని ప్రశ్నించారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 70 ఏళ్లుగా బీసీలకు చెందిన హక్కులను మనమే వాడుకుంటున్నామని ఇక వాటిని అడ్డుకోకూడదని ఆ ఇద్దరిని రేవంత్ రెడ్డి ఎందుకు మేనేజ్ చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. ‘బీసీ రిజర్వేషన్లకు రెడ్డి ముఖ్యమంత్రి జీవో ఇస్తారు, వాటిని వ్యతిరేకిస్తూ రెడ్డిలే కోర్టులకు వెళ్తారు, రెడ్డి లాయర్లే ఆ పిటిషన్లపై వాదిస్తారు’ అని ఎద్దేవా చేశారు. హైకోర్టులో ఈ నెల 8వ తేదీన బీసీ రిజర్వేషన్లపై విచారణ జరపబోయే జడ్జి రేపు రిటైర్ కాబోతున్నారన్నారు. బీసీలను పిచ్చోళ్లను చేసేందుకు హైకోర్టు, సుప్రీంకోర్టు చుట్టూ తిప్పుతూ బీసీలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.

అడ్డుకుంటే తిరుగుబాటే:

బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు పదే పదే ప్రయత్నాలు చేస్తున్నారని పిటిషన్లు వేసిన వారిని రిక్వెస్ట్ చేశామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రానివ్వమని ఇదే రకంగా మొండిగా ముందుకు వెళ్తే తెలంగాణ సమాజంలో సరికొత్త ఉద్యమం పుట్టుకొస్తుందని ఇది తిరుగుబాటుగా మారుతుందని మల్లన్న హెచ్చరించారు. ఆ తర్వాత జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలను ఆశల పల్లకిలో ఊగిస్తోందని రిజర్వేషన్ల విషయం హైకోర్టు పరిధిలో ఉండగా సుప్రీంకోర్టుకు వచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో విధానపరమైన నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం వద్దకు రాలేదన్నారు. తమిళనాడు దివంగత సీఎం జయలలిత శపథం చేసి ఢిల్లీకి వచ్చి ప్రధానిని ఒప్పించి, 9వ షెడ్యూల్ లో రిజర్వేషన్లను చేర్చుకున్న విధానం వేరు తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానం వేరుగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చీకటి చాటున రిజర్వేషన్లను బీసీల చేతిలో పెట్టాలని చూస్తోందని కానీ ఇది న్యాయస్థానాల్లో నిలబడదన్నారు.

ప్రభుత్వ విజయం కాదు:

ఇవాళ సుప్రీంకోర్టు చెప్పిన నిర్ణయం ప్రభుత్వ విజయమో మరొకటో కాదన్నారు. ఇది కేవలం ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెత్ మాత్రమే అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఇబ్బంది పడుతున్నారని అడ్వకేట్లు, మంత్రులు, సిబ్బందిని ఢిల్లీకి పంపించే బదులు పిటిషన్లు వేసిన ఇద్దరు రెడ్లను సీఎం ఆపగలిగిచే అయిపోతుందన్నారు. ఆ పని చేయకుండా అటువైపు రెడ్లను ఇటువైపుగా మంత్రులను పంపిస్తున్నారని విమర్శించారు. దయచేసి రెడ్లకు రిక్వెస్ట్ చేస్తున్నామని బీసీ రిజర్వేషన్లను అడ్డుకుని బీసీల పొట్ట కొట్టవద్దన్నారు.

Next Story