‘బీఆర్ఎస్‌ చావును కేసీఆర్ కళ్లారా చూడాలి’: ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-21 10:53:17  IST  )

తెలంగాణ బీజేపీ కీలక నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ రాజకీయ ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

‘బీఆర్ఎస్‌ చావును కేసీఆర్ కళ్లారా చూడాలి’: ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ కీలక నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ రాజకీయ ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా రైతుల ఇబ్బందులు, కేసీఆర్ కుటుంబంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అర్వింద్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల్లో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయని, రైతుల గోడును పట్టించుకునే వారే కరువయ్యారని మండిపడ్డారు. ఈ సందర్భంగా పసుపు రైతులకు ఎంపీ అర్వింద్ కీలక హామీ ఇచ్చారు. తాను రాజకీయాల నుంచి తప్పుకునే లోపు పసుపు పంటకు క్వింటాల్‌కు రూ.30 వేల మద్దతు ధర కల్పించి తీరుతాను అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాల కోసం తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్..

జగిత్యాల సభలో కేసీఆర్ పచ్చి అబద్ధాలు ఆడారని అర్వింద్ విమర్శించారు. కేసీఆర్ ఆరోగ్యంపై స్పందిస్తూ.. కేసీఆర్ చావును మేము కోరుకోవడం లేదు. ఆయన ఆరోగ్యంగా ఉండాలి. కానీ, ఆయన తన కళ్ళతో బీఆర్ఎస్ పార్టీ అంతం కావడం చూడాలని నేను కోరుకుంటున్నాను. అది త్వరలోనే జరుగుతుందని నమ్ముతున్నాను అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను కేటీఆర్, కవితలే ఎక్కువగా హింసిస్తున్నారని అర్వింద్ ఆరోపించారు. కవిత, కేటీఆర్‌లకు ఫ్లైట్ టికెట్ ఇచ్చి పంపిస్తే కేసీఆర్ దరిద్రంతో పాటు తెలంగాణ దరిద్రం కూడా వదులుతుంది అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

కేసీఆర్ విద్యనే రేవంత్ ప్రయోగిస్తున్నారు: రఘునందన్ రావు

Next Story