- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ విషయంలో హరీష్ రావు కేసీఆర్‌నే బ్లాక్ మెయిల్ చేశాడు: కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుపై మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుపై మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హరీష్ రావు తన అస్తిత్వం కోసమే ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఆయన పేరు హరీష్ రావు కాదు ‘బ్లాక్ మెయిల్ రావు’ అని ఎద్దేవా చేశారు. గురువారం సీఎల్పీ మీడియా సెంటర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి సంబంధం లేని కంపెనీలను హరీష్ రావు అంటగడుతున్నారని బత్తుల లక్ష్మారెడ్డి మండిపడ్డారు. "శిల్పా ఇన్ఫోటెక్ కంపెనీలో పొంగులేటి గానీ, ఆయన కుమారుడు గానీ డైరెక్టర్లుగా లేరు. ఏక్యూ అండ్ ఏఎం బిల్డర్స్, క్రిస్టల్ మ్యాన్షన్‌తో కూడా ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. వీటికి సంబంధించిన అన్ని పత్రాలను మీడియా ముందు ఉంచుతున్నాం" అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఏయే కంపెనీలకు లబ్ధి చేకూర్చారో హరీష్ రావుకు బాగా తెలుసని, నాదర్‌గుల్ భూముల ముటేషన్, రిజిస్ట్రేషన్ 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వమే చేసిందని గుర్తు చేశారు.
బ్లాక్ మెయిల్ దందాతోనే రాజకీయాలు..
హరీష్ రావు జీవితమే బ్లాక్ మెయిల్ రాజకీయాలతో ముడిపడి ఉందని BLR ఆరోపించారు. "ఉద్యమ సమయంలో ఆంధ్రా, తెలంగాణ పారిశ్రామికవేత్తలను బ్లాక్ మెయిల్ చేసిన చరిత్ర హరీష్ రావుది. చివరికి సొంత మామ(కేసీఆర్)ను బ్లాక్ మెయిల్ చేసి ఇరిగేషన్ మంత్రి అయ్యాడు. తన సీక్రెట్ ఫైల్స్ బయటపడకుండా ఉండేందుకే ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడు" అని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు దారి తప్పిందని, ప్రజలు ఆ పార్టీని బండకేసి కొట్టినా బుద్ధి రావడం లేదని లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. "మామ (కేసీఆర్) ఫామ్ హౌస్ దాటడం లేదు.. బామ్మర్ది (కేటీఆర్) ఊర్లో లేడు.. కవిత పార్టీలో లేదు.. అందుకే హరీష్ రావు రెచ్చిపోతున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు 'భూముల రాష్ట్ర సమితి' అని పిలుచుకోవచ్చని, వారి రాజకీయమంతా భూముల చుట్టూనే తిరుగుతోందని ఎద్దేవా చేశారు.
బహిరంగ చర్చకు సిద్ధమా..?
హరీష్ రావుకు చిత్తశుద్ధి ఉంటే బహిరంగ చర్చకు రావాలని బత్తుల లక్ష్మారెడ్డి సవాల్ విసిరారు. "2014 నుంచి 2026 వరకు జరిగిన భూముల కేటాయింపులు, బదలాయింపులపై విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. హరీష్ రావుకు దమ్ముంటే 2029 వరకు బీఆర్ఎస్‌లోనే ఉంటానని చెప్పగలరా?" అని ప్రశ్నించారు. గజ్వేల్ ప్రజలకు కేసీఆర్ దర్శనం కరువైందని, ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫొటో పెడితే తీసివేయడం వంటి అరాచకాలు సాగవని హెచ్చరించారు. తెలంగాణ ఎవరి జాగీరు కాదని, కేసీఆర్ విర్రవీగుతున్న రోజుల్లోనే రేవంత్ రెడ్డి గట్టిగా నిలబడ్డారని లక్ష్మారెడ్డి కొనియాడారు. రేవంత్ రెడ్డి ముందు హరీష్ రావు బ్లాక్ మెయిల్ దందాలు చెల్లవని, సరైన సమయంలో అవినీతి బాంబులు పేలుతాయని ఆయన హెచ్చరించారు.






