BRS: కౌశిక్‌రెడ్డిని చంపేందుకు కుట్ర

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మండిపడ్డారు. శుక్రవారం డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు.

BRS: కౌశిక్‌రెడ్డిని చంపేందుకు కుట్ర
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మండిపడ్డారు. శుక్రవారం డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. వెనుకబడిన రాష్ట్రాలలో పరిస్థితి ఎలా ఉన్నదో.. ఇక్కడా అదేవిధంగా కొనసాగుతున్నదని చెప్పారు. రాజకీయ పార్టీల నేతల కార్యాలయాలపై, ఇండ్లపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో పోలీసుల చేతగానితనాన్ని డీజీపీకి వివరించామన్నారు. కౌశిక్‌రెడ్డిని చంపాలని చూశారని.. బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తాము సమాధానం చెప్పాలా వద్దా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ రెచ్చగొడితేనే కార్యకర్తలు వచ్చారని.. ఆయనపై కేసు నమోదు చేసి కౌశిక్ రెడ్డికి భద్రత పెంచాలని డిమాండ్ చేశారు. కేపీ వివేకానంద మాట్లాడుతూ.. బండి సంజయ్, సీఎం రేవంత్‌రెడ్డి మధ్య చీకటి ఒప్పందాలు, వ్యాపారాలు అందరికీ తెలుసన్నారు. సీఎంకు ఎప్పుడు ఆపద వచ్చినా కేంద్ర సహాయ మంత్రి సంజయ్ సీఎంకు సహాయ మంత్రిగా ఉంటున్నారని ఎద్దేవా చేశారు. బండి సంజయ్‌కి అహంకారం పెరిగిందని, 2014 ముందు ఏ విధంగా డబ్బులు వసూలు చేశారో తమకు తెలుసన్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, అప్పుడు గుజరాత్ వెళ్లి దాచుకోవాలని హెచ్చరించారు.

ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన హోంశాఖ సహాయ మంత్రి గూండాలను పెట్టి కొట్టిస్తున్నారని, ప్రభుత్వమే ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజ్ శ్రవణ్ మాట్లాడుతూ.. భారత్ మాతాకీ జై అనే వారి నోటి నుంచి వచ్చే మాటలేనా అవి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌పై బండి సంజయ్ వాడిన భాష బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్నదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కార్యాలయాలు, క్యాంప్ ఆఫీసులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించేదాకా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. డీజీపీని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ సంజయ్ తదితరులు ఉన్నారు.

Next Story