నల్లగొండ జిల్లాలో సంచలనం.. ఎమ్మార్వో‌పై అరెస్ట్ వారెంట్ జారీ

by Kema Shiva Kumar |

తిరుమలగిరి సాగర్ తహశీల్దార్ అనిల్‌కు హ్యుమన్ రైట్స్ కమిషన్ షాకిచ్చింది. భూ వివాదంలో పక్షపాతంగా వ్యవహరించడమే కాకుండా, నివేదిక సమర్పించనందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

నల్లగొండ జిల్లాలో సంచలనం.. ఎమ్మార్వో‌పై అరెస్ట్ వారెంట్ జారీ
X

దిశ, వెబ్‌డెస్క్: అధికార గర్వంతో విచక్షణ కోల్పోయి, రాజ్యాంగబద్ధమైన కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేసిన నల్లగొండ (Nalgonda) జిల్లా తిరుమలగిరి సాగర్ (Tirumalagiri Sagar) తహసీల్దార్ అనిల్‌ (Anil)పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ భూ వివాదం కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గానూ ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని ఒక భూ వివాదంలో ఎమ్మార్వో అనిల్ అత్యుత్సాహం ప్రదర్శించారని.. బాధితుడి పట్ల పక్షపాతంగా, ఏకపక్షంగా వ్యవహరిస్తూ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మార్వో తీరుతో తీవ్ర అన్యాయానికి గురైన బాధితుడు, న్యాయం కోసం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.

కమిషన్ ఆదేశాలు బేఖాతరు..

అయితే, బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన హెచ్‌ఆర్‌సీ (HRC), ఈ వివాదంపై సమగ్ర విచారణ జరిపి పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని గతంలోనే ఎమ్మార్వో అనిల్‌ను ఆదేశించింది. అయితే, కమిషన్ ఆదేశాలను ఏమాత్రం లెక్కచేయని ఎమ్మార్వో, గడువు ముగిసినా నివేదికను సమర్పించకుండా కాలయాపన చేశారు. ప్రభుత్వ అధికారి అయి ఉండి, ఒక బాధ్యతాయుతమైన కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేయడంపై హెచ్‌ఆర్‌సీ తీవ్రంగా పరిగణించింది.

అరెస్ట్ చేసి ప్రవేశపెట్టాలని పోలీసులకు డైరెక్షన్..

తహసీల్దార్ అనిల్ నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్, చివరకు ఆయనపై అరెస్ట్ వారెంట్ (Arrest Warrent) జారీ చేసింది. వెంటనే ఎమ్మార్వో అనిల్‌ను అరెస్ట్ చేసి తమ ముందు ప్రవేశపెట్టాలని పోలీసు శాఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఇలాంటి కేసుల్లో వివరణ కోరడం పరిపాటి, కానీ నేరుగా ఒక ఎమ్మార్వోపై అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో జిల్లా యంత్రాంగంలో ఒక్కసారిగా వణుకు మొదలైంది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అధికారులకు ఈ ఘటన ఓ వార్నింగ్‌గా హెచ్చరికగా నిలుస్తుందని ప్రజలు భావిస్తున్నారు.

Next Story