ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారు?.. కవితకు రివర్స్ అయిన జాగృతి సీనియర్లు

by Prasad Jukanti |   (  Updated:2025-09-04 10:53:25  IST  )

కవితకు జాగృతి నేతలు బిగ్ షాకిచ్చారు.

ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారు?.. కవితకు రివర్స్ అయిన జాగృతి సీనియర్లు
X

దిశ,డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ లో చోటు చేసుకున్న పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. పార్టీకి, పదవికి రాజీనామా చేసిన కవిత (Kavitha) భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతున్నది అనే చర్చ జరుగుతున్న వేళ జాగృతి సీనియర్లు కవితకు రివర్స్ అయ్యారు. తెలంగాణ జాగృతి (Telangana Jagruti) ఏర్పాటు నుంచి కీలకంగా వ్యవహరించిన తెలంగాణ ఫుడ్స్ కార్పోరేషన్ మాజీ​చైర్మన్ ​మేడే రాజీవ్ ​సాగర్, రాష్ట్ర ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌గా మఠం భిక్షపతి (Matam Bikshapathi), కొదారి శ్రీను సహా పలువురు ముఖ్య నేతలు కవితతో తాము నడవడం లేదని ప్రకటించారు. తామంతా కేసీఆర్ వెంటే ఉన్నామని తెలిపారు. ఇవాళ హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మఠం భిక్షపతి మాట్లాడుతూ.. 18 ఏళ్లుగా కవితతో ప్రయాణం చేసిన తాము ఇవాళ బరువెక్కిన గుండెలతో మాట్లాడుతున్నామని అన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాక్షసపాలన సాగుతోందని ఈ పాలన పోయి మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న సందర్భంలో కేసీఆర్ వెన్నంటే ఉంటూ ఉద్యమాలు చేయాల్సిన కవిత.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఊతమిచ్చేలా వ్యవహరిస్తున్న కవిత తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

అనేక సందర్భాల్లో పస్తులుండి మీరు చెప్పిన పనులు చేశాం. ఇన్నాళ్లు మీ వెంట నడిచాం. కానీ ఇప్పుడు మాకు సమాచారం ఇవ్వకుండానే సొంత ఎజెండాతో నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఏనాడైనా మా బాగోగులు కనుకున్నారా? అని కవితను నిలదీశారు. ఇప్పటికీ అనేక మంది తెలంగాణ జాగృతి నేతలు ఇళ్లలో పూట గడిచే పరిస్థితి లేదు. ఇదేనా మీరు మాకిచ్చే గుర్తింపు అని ప్రశ్నించారు. మీ వెంట నడిచిన మాకు వెేల సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారు. వారి పరిస్థితి ఏంటన్నారు. డబ్బున్న కొత్త నాయకులను కొత్తగా తీసుకోచ్చుకుని సొంత ఎజెండాతో వెళ్తే ఇన్నాళ్లు మీకోసం పని చేసిన జాగృతి బిడ్డల ఉసురు పోసుకుని పోయినట్లు కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ జాగృతి మా అందరిదని మేము కేసీఆర్ వెంట ఉన్నామన్నారు. మీ వెంట తీసుకువెళ్తున్నది తెలంగాణ జాగృతి కాదని అది కాంగ్రెస్ జాగృతి అన్నారు. ఈ వేదికపై ఉన్నదే అసలైన తెలంగాణ జాగృతి అన్నారు. కవిత చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని కవిత వ్యాఖ్యలు చేస్తే కవితపై ఎలాంటి విమర్శలు చేయవద్దని ఆమె మా ఇంటి ఆడబిడ్డ అని శ్రేణులకు హరీశ్ రావు చెప్పారని ఇందుకు నేనే సజీవ సాక్ష్యం అన్నారు. హరీశ్ రావు పార్టీని లాక్కోవాలని చూస్తున్నారని కవిత అంటున్నారు. కానీ హరీశ్ రావు మాత్రం మనమంతా కేసీఆర్ కోసమే పని చేయాలని కార్యకర్తలందరికీ అనేక సందర్భాల్లో చెప్పారన్నారు. హరీశ్ రావు విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారని నాలుగు నెలల క్రితం కవితనే ఓ మీడియాతో చెప్పారు. అంటే నాలుగు నెలల క్రితం చెప్పిన మాటలు అబద్దమా? లేక తాజాగా చేసిన వ్యాఖ్యలు అబద్దమా చెప్పాలన్నారు.

జాగృతిపై మాకూ హక్కుంది: మేడే రాజీవ్ సాగర్

మేడే రాజీవ్ సాగర్ మాట్లాడుతూ.. ఇన్నాళ్లు కవితను కుర్చీపై ఉంచి కిందుండి తాము పని చేశామని ఆమె ఏ పిలుపు ఇచ్చినా రాత్రింబవళ్లు సక్సెస్ చేశామన్నారు. కేసీఆర్ ఉన్నారు కాబట్టే తామంతా తెలంగాణ జాగృతికి పని చేశామని ఎప్పుడైతే సొంత ఎజెండాతో కేసీఆర్ కు వ్యతిరేకంగా పని చేయడం మొదలు పెట్టారని విమర్శించారు. ఇన్నాళ్లు జాగృతితో నడిచిన తమతో కనీసం ఒక్కసారి కూడా కవిత మాట్లాడకుండా ఈ నిర్ణయాలన్నీ తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు చెప్పిన ప్రతి పనిని చేసుకుంటూ ముందుకు వెళ్లిన తమను ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. ఈ మీ మాటను నమ్మి మీ వెంట 18 ఏళ్లుగా అనేక మంది నడిచారని వారందరి జీవితాలు ఏం కావాలని ప్రశ్నించారు. మీరు తీసుకున్న నిర్ణయం వల్ల మా జీవితాలన్నీ రోడ్డున పడ్డాయన్నారు. ఇన్నాళ్లు తామంతా బీఆర్ఎస్ కు అనుబంధంగా ఉన్న తెలంగాణ జాగృతిలో పని చేశామని జాగృతిపై కవితకు ఎంత హక్కు ఉందో మాకూ అంతే హక్కు ఉందన్నారు. అందువల్లే ఇవాళ తాము జాగృతి ఫోటో పెట్టుకుని మాట్లాడుతున్నామన్నారు. మేము కూడా తెలంగాణ జాగృతి పేరుతోనే పని చేస్తామని అయితే మేమంతా కేసీఆర్ కోసం పని చేస్తామన్నారు.

Next Story