- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీనియర్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలి : టీఎస్ యూటీఎఫ్
దేశవ్యాప్తంగా 25 లక్షల మంది, రాష్ట్రంలో 45 వేలమంది ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తున్న టెట్ పరీక్షను 2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులకు మినహాయింపునిస్తూ విద్యాహక్కు చట్టాన్ని సవరించాలని వారు డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యాహక్కు చట్టం అమలు, ఎన్సీటిఈ నోటిఫికేషన్ కి పూర్వం నియామకమైన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) రాష్ట్ర కార్యాలయం నుండి ప్రధానమంత్రి కార్యాలయానికి గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా మెమోరాండం సమర్పించామని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఎ వెంకట్ ఒక ప్రకటనలో తెలిపారు.
దేశవ్యాప్తంగా 25 లక్షల మంది, రాష్ట్రంలో 45 వేలమంది ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తున్న టెట్ పరీక్షను 2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులకు మినహాయింపునిస్తూ విద్యాహక్కు చట్టాన్ని సవరించాలని వారు డిమాండ్ చేశారు. ఎన్సీటిఈ నోటిఫికేషన్ కి ముందు నియామకమైన టీచర్లు టెట్ పరీక్ష వ్రాయాల్సిన అవసరం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినందునే గత 15 సంవత్సరాలుగా ఉపాధ్యాయులు టెట్ వ్రాయలేదని, ఇప్పుడు హఠాత్తుగా రెండేళ్ళలో టెట్ పాస్ కాకపోతే ఉద్యోగానికి ఉద్వాసన పలుకుతామని చెప్పడం సమంజసం కాదన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు వచ్చి రెండు నెలలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రివ్యూ పిటిషన్ వేయలేదు. కనీసం డిసెంబర్ 1 నుండి జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చట్టాన్ని సవరించి సీనియర్ ఉపాధ్యాయుల ఉద్యోగాలకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మంగళవారం రాష్ట్ర, కేంద్రంతోపాటు అన్ని జిల్లా కేంద్రాలు, కొన్ని డివిజన్ కేంద్రాల నుండి ప్రధానమంత్రికి వినతిపత్రాలు మెయిల్, పోస్ట్ ద్వారా పంపించినట్లు తెలిపారు. నేటి నుండి నెలాఖరు వరకు రాష్ట్రంలోని పార్లమెంటు సభ్యులందరికీ వినతిపత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు.
- Tags
- TSUTF






