- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆపరేషన్ పాపారావు? మళ్లీ తృటిలో తప్పించుకున్న మావోయిస్టు సీనియర్ నేత
మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ నేత, టాప్ కమాండర్ పాపారావుపై భద్రతా బలగాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టగా.. ఆయన మళ్లీ తృటిలో తప్పించుకున్నారు. కీలక నేతలను కోల్పోయిన మావోయిస్టు పార్టీలో పాపారావు మోంగు (57) ముఖ్య నేతగా ఉన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో/భద్రాచలం : మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ నేత, టాప్ కమాండర్ పాపారావుపై భద్రతా బలగాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టగా.. ఆయన మళ్లీ తృటిలో తప్పించుకున్నారు. కీలక నేతలను కోల్పోయిన మావోయిస్టు పార్టీలో పాపారావు మోంగు (57) ముఖ్య నేతగా ఉన్నారు. మాడ్వి హిడ్మా సారథ్యం వహించిన బెటాలియన్‌కు బార్సె దేవా తర్వాత పాపారావునే బాధ్యుడిగా ఉంటున్నట్టు సమాచారం. బీజాపూర్‌లోని ఇంద్రావతి నేషనల్ పార్క్ పరిసరాల్లో పాపారావు సహా పలువురు కీలక మావోయిస్టు నాయకులు ఉన్నారనే ఇంటెలిజెన్స్ సమాచారంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రా దళాలు జాయింట్ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఉభయ పక్షాలు ఎదురుపడగా శనివారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. మధ్యాహ్నానికల్లా ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు లభించినట్టు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ వివరించారు. ఇందులో పాపారావు సైతం మరణించాడా? అనే అనుమానాలతో కథనాలు వచ్చాయి. కానీ, ఆయన తృటిలో తప్పించుకున్నట్టు తెలుస్తున్నది. ఈ కాల్పులు సాయంత్రం వరకూ సాగాయని, ఆ తర్వాత మరో రెండు డెడ్‌బాడీలు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు.
దక్షిణ బస్తర్‌లో పాపారావుకు పట్టు
ఛత్తీస్‍గఢ్‌లోని కిష్టారం ప్రాంతానికి చెందిన పాపారావు.. దండకారణ్య ప్రాంతంలో పార్టీకీ కీలక వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. మాడ్వి హిడ్మా వంటి ఇతర సీనియర్లు మరణించిన తర్వాత దక్షిణ బస్తర్‌లో మిగిలిన టాప్ మావోయిస్టు నేతల్లో ఒకడిగా కొనసాగుతున్నారు. దక్షిణ బస్తర్‍లో ఉన్న మావోయిస్టు క్యాడర్లపై పాపారావుకు గట్టి పట్టు ఉన్నది. దీంతో గత కొంతకాలంగా ‘ఆపరేషన్ పాపారావు’ పేరుతో భద్రతా దళాలు ఛత్తీస్‌గఢ్ అడవులను జల్లెడ పడుతుండగా.. 2025 నవంబర్ 11న జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాల నుంచి పాపారావు తృటిలో తప్పించుకున్నారు. ఇప్పుడు మరోసారి చిక్కినట్లే చిక్కి తప్పించుకున్న ఆయన కోసం ఇంకా అడవులను గాలిస్తున్నట్టు జితేంద్ర యాదవ్ తెలిపారు.
దిలీప్ వెడ్జా సహా నలుగురు నక్సలైట్లు మృతి
మొత్తంగా ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో దండకారణ్య జోనల్ కమిటీ మెంబర్ దిలీప్ వెడ్జా అలియాస్ సుక్కు ఉన్నట్టు ధ్రువీకరించినట్టు ఎస్పీ వివరించారు. ఒక మహిళా మావోయిస్టు, మరో ఇద్ద్రు నక్సలైట్లు కూడా ఉన్నారని, వీరి గుర్తింపును ఇంకా ధ్రువీకరించాల్సి ఉన్నదని పేర్కొన్నారు. వెడ్జాపై రూ. 80 లక్షల రివార్డు ఉంది. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని బస్తర్ ఐజీ సుందర్రాజ్ చెప్పారు. దాదాపు 500 మంది బలగాలు మావోయిస్టులను చుట్టు ముట్టి కాల్పులు జరిపినట్లు ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఒక ఏకే-47, రెండు రైఫిళ్లు, పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నామని వివరించారు.






