సీనియర్ నేతలే నన్ను మోసం చేశారు.. ఎమ్మెల్యే మేఘారెడ్డి హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-19 03:39:30  IST  )

సీనియర్ నేతలే నన్ను మోసం చేశారు.. ఎమ్మెల్యే మేఘారెడ్డి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: వనపర్తి (Wanaparthy) కాంగ్రెస్‌లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. పంచాయతీ ఎన్నికల వేళ పార్టీలోని సీనియర్లు తనకు అన్యాయం చేశారంటూ ఎమ్మెల్యే మేఘారెడ్డి (MLA Megha Reddy) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. అధిష్ఠానం అడిగితే తాను లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమని తెలిపారు. ఇవాళ ఉదయంలో ఆయన ఓ ప్రముఖ మీడియా చానల్ ప్రతినిధితో మాట్లాడుతూ.. పార్టీ జెండా మోసిన అనుకునే వాళ్లు నిలువునా మోసం చేశారని అన్నారు. ముందు నుంచి ఒకరు, వెనుక నుంచి మరొకరు పొడిచారని ఆవేదన వ్యక్తం చేశారు.

నా వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయి..

వనపర్తి నియోజకవర్గ పరిధిలో 140 గ్రామ పంచాయతీలు ఉన్నాయని అన్నారు. అందులో తాము 85 పంచాయతీల్లో విజయం సాధించామని తెలిపారు. మరో 10 నుంచి 15 స్థానాల్లో తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకులే మోసం చేశారని ఆరోపించారు. ఒకవేళ ఎలాంటి అవాంతరాలు లేకపోతే 100 పైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేదని అన్నారు. ఏ గ్రామంలో ఎవరెవరు సమస్యలు సృష్టించారనేది ప్రజలకు, పార్టీ పెద్దలకు లెక్కలతో సహా చెబుతానని తెలిపారు. తన సారథ్యంలో అత్యధిక పంచాయతీలు గెలవకుండా కొందరు సీనియర్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రోత్సహించి కుట్రలు చేశారని, అధిష్టానం అడిగితే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమని అన్నారు. జంగమయ్యపల్లి, ఉప్పరపల్లి, అప్పారెడ్డిపల్లి, గోపాల్‌పేట, పొలికపాడులో ఇలా చాలా గ్రామాల్లో జరిగిన పరిణామాలకు సంబంధించి తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని.. అవాస్తవం కాదని స్పష్టం చేశారు. మేఘారెడ్డిపై కోపం ఉంటే.. మేఘారెడ్డిని, మల్లు రవి (Mallu Ravi)పై కోపం ఉంటే మల్లు రవిని పొడవాలని, అంతే కానీ పార్టీకి అన్యాయం చేయడం సరికాదని మేఘారెడ్డి అన్నారు.


Read More..

ప్రభుత్వ అంశాల్లో టీపీసీసీ చీఫ్ జోక్యం.. సరికాదంటున్న సీనియర్లు

Next Story