సీనియర్ అధికారి కౌంటర్ దమ్కీ.. సెక్రటేరియట్లో హాట్ టాపిక్‌గా ఐఏఎస్

by Naga Rani Yarlagadda |

సెక్రటేరియట్లో ఇప్పుడు ఓ ఐఏఎస్ ఆఫీసర్ చేసిన పని హాట్ టాపిక్ గా మారింది.

సీనియర్ అధికారి కౌంటర్ దమ్కీ.. సెక్రటేరియట్లో హాట్ టాపిక్‌గా ఐఏఎస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : నార్త్ ఇండియాకు చెందిన కార్పొరేట్ వ్యక్తితో పని నిమిత్తం డీల్ చేసుకున్న ఓ ఐఏఎస్ అధికారి దానిని పూర్తిచేయకపోగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినందుకు బెదిరింపులకు దిగాడు. డబ్బులు అడిగితే కేసులు పెట్టించి జైలుకు పంపుతానని దమ్కీ ఇచ్చారు. దీంతో లబోదిబోమంటూ బాధిత కార్పొరేట్ వ్యక్తి తన సన్నిహితులకు విషయం చెప్పారు. వారంతా ఏకమై గుజరాత్ వ్యాపారుల లాబీని రంగంలోకి దింపే ప్రయత్నం చేశారు. విషయాన్ని గ్రహించిన సీనియర్ ఐఏఎస్ విషయం మరింత లాగితే అసలుకే ఎసరు వస్తుందని భావించి సగం డబ్బులు వెనక్కి ఇచ్చినట్లు తెలిసింది. దీనిపై ప్రస్తుతం సెక్రెటేరియట్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.

రూ.10 కోట్లకు కుదిరిన డీల్?

ప్రభుత్వంలోని కీలకమైన శాఖ బాధ్యతలు చూస్తున్న ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి లావాదేవీలను నేరుగా మాట్లాడకుండా ఓ మీడియేటర్‌ను నియమించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆ శాఖలోని వ్యవహారాలన్నింటినీ సదరు మధ్యవర్తి ద్వారానే సంబంధిత అధికారి క్లియర్ చేస్తారని ప్రచారం ఉంది. అందులో భాగంగా నార్త్ ఇండియాకు చెందిన ఓ కార్పొరేట్ పర్సన్‌కు చాలా కాలంగా సంబంధిత శాఖలో పెండింగ్‌లో ఉన్న పనిని క్లియర్ చేయించుకోవాలని భావించారు. అందుకోసం మధ్యవర్తి ద్వారా కీలక శాఖ బాధ్యతలు చూస్తోన్న సీనియర్ ఐఏఎస్ అఫీసర్‌ను కలిశారు. పని పూర్తి చేయడానికి రూ.10 కోట్లకు డీల్ మాట్లాడుకుని, అడ్వాన్‌గా రూ.కోటిన్నరకు పైగా నగదును తీసుకున్నట్లు తెలిసింది. కానీ, ఈలోపే ప్రభుత్వం ఆ సీనియర్ ఆఫీసర్‌ను ఆ శాఖ నుంచి బదిలీ చేయడంతో ఫైల్ క్లియర్ చేయలేకపోయారు. దీంతో పని కాలేదని, తాము ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి ఇవ్వాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు.

కార్పొరేట్ వ్యక్తుల కౌంటర్ దమ్కీ..

డబ్బులు వెనక్కి ఇవ్వాలని నిత్యం ఫోన్ చేస్తుండంతో సీనియర్ ఐఏఎస్ విసుగు చెంది డబ్బులు అడిగితే తనకు ఉన్న పరిచయాలతో పోలీసులకు చెప్పి కేసుల్లో ఇరికిస్తానని బెదిరించారు. దీనితో బాధితుడు తన బిజినెస్ సర్కిల్స్‌‌లోని వారికి అసలు విషయం వివరించి బోరున విలపించారు. దీంతో వారంతా ఏకమై గుజరాత్‌కు చెందిన బిజినెస్ లాబీని కలిసి సదరు ఐఏఎస్ అధికారి వ్యవహారాన్ని పూసగుచ్చినట్లు వివరించారు. అనంతరం వారే ఏకంగా రంగంలోకి దిగి తీసుకున్న డబ్బులు ఇవ్వకపోతే తమ గుజరాత్ పవర్‌ను చూపిస్తామని సంకేతాలు పంపారని ప్రచారం జరుగుతున్నది. మ్యాటర్ చేయి దాటిపోతుందని గ్రహించిన సదరు అధికారి తీసుకున్న అడ్వాన్స్‌లో సగం డబ్బులు వెనక్కి ఇచ్చినట్లు ప్రచారం ఉంది.

వివాదాల సెక్రెటరీ

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన అధికారులకు ప్రయారిటీ ఇవ్వాలని భావించింది. అందులో భాగంగా సదరు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్‌కు కీలకమైన శాఖ బాధ్యతలు అప్పగించారు. చార్జ్ తీసుకున్న కొత్తలో ఆయన పనితీరును చూసి అందరూ మెచ్చుకున్నారు. కానీ రోజులు గడుస్తున్న కొద్ది ఆయన అసలు స్వరూపం బహిర్గతం అవ్వడం మొదలైంది. తన ఆమోదం కోసం వచ్చే ఫైల్స్‌పై ఎదో ఒక కొర్రీ వేయడం, మంత్రుల సిఫారసులను వెనక్కి పంపడం పరిపాటిగా మారిందని విమర్శలు ఉన్నాయి. ఆయన వ్యవహార శైలి నచ్చక ఆ శాఖ మంత్రి సైతం పలుమార్లు అసహనానికి గురైనట్లు తెలుస్తున్నది. దీంతో ఆయన్ను కొన్ని రోజుల కిందట ఆ శాఖ నుంచి తప్పించారు.

Next Story