- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీనియర్ IAS అరవింద్ కుమార్‌కు షాక్.. సెలవులను రద్దు చేసిన సర్కార్
ఫార్ములా ఈ రేసు కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ సెలవులను ప్రభుత్వం రద్దు చేసినట్లు తెలిసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఫార్ములా ఈ రేసు కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ సెలవులను ప్రభుత్వం రద్దు చేసినట్లు తెలిసింది. ఆయన్ను వెంటనే రాష్ట్రానికి రావాలని సీఎస్ రామకృష్ణరావు ఆదేశించినట్లు తెలుస్తున్నది. ఆయనకు ఏప్రిల్ 15న అప్పటి సీఎస్ శాంతికుమారి నెల రోజులపాటు సెలవులు మంజూరు చేస్తూ జీవో జారీ చేశారు. అయితే సీఎం నోటీసులో లేకుండానే శాంతికుమారి లీవ్ సాంక్షన్ చేసినట్లు సెక్రటేరియట్ వర్గాల్లో టాక్ ఉంది. కీలకమైన కేసులో ముద్దాయిగా ఉన్న అధికారికి సెలవు మంజూరు చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
సెలవు మంజూరుపై సీఎం సీరియస్
రెండు రోజులుగా ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ కోసం ఆరా తీసేపనిలో ఉన్నారు. కేటీఆర్ విచారణ తరువాత మరోసారి అరవింద్‌ను పిలిచి ఎంక్వైరీ చేయాలని భావించి, అందుకు నోటీసులు రెడీ చేశారు. కానీ ఆయన స్థానికంగా లేకపోవడంతో షాక్ గురయ్యారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఏసీబీ అఫీసర్లు తీసుకెళ్లడంతో ఆయన సీరియస్ అయినట్లు తెలుస్తున్నది. వెంటనే అరవింద్ సెలవులు క్యాన్సిల్ చేసి, రాష్ట్రానికి రప్పించాలని సీఎస్ రామకృష్ణరావును ఆదేశించడంతో ఆయన సెలవులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ విషయాన్ని సీఎస్ ఆఫీస్ స్టాఫ్ అరవింద్ కుమార్‌కు ఫోన్ చేసి సెలవులు రద్దుచేసిన విషయాన్ని వివరించినట్లు సమాచారం. దీనితో ఆయన ఈనెల 21న హైదరాబాద్‌లో అందుబాటులో ఉండేలా తన పర్యటనను రద్దుచేసుకుని వెనక్కి వచ్చేందుకు రెడీ అయినట్లు ఐఏఎస్ వర్గాల్లో టాక్ ఉంది.
శాంతికుమారిపై విమర్శలు
అరవింద్ కుమార్‌కు జూన్ 1 నుంచి జూన్ 30 వరకు యూరప్‌లో పర్యటించేందుకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది. ఏప్రిల్ 15న అప్పటి సీఎస్ శాంతికుమారి ఆయనకు లీవ్ సాంక్షన్ చేశారు. అయితే కీలకమైన కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్న అరవింద్‌కు సెలవులు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయనకు సెలవులు ఎందుకు ఇచ్చారు? ఏ ఉద్దేశ్యంతో మంజూరు చేశారు? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాని లీవ్ సాంక్షన్ చేసే ముందు శాంతికుమారి సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లకుండా రహస్యంగా ఉంచారని ఆరోపణలు ఉన్నాయి. అయితే సెక్రటేరియట్ సర్వీస్ రూల్స్ ప్రకారం ఐఏఎస్‌లు విదేశి పర్యటనకు వెళ్లేందుకు సీఎస్ అనుమతి ఇస్తుంటారు. అందుకు సీఎం అనుమతి తీసుకుని సాంక్షన్ చేస్తారు. కానీ అరవింద్‌కు సెలవులు మంజూరు చేసే విషయంలో అప్పటి సీఎస్ శాంతికుమారి సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారా?లేదా?అనేది ఆసక్తికరంగా మారింది.






