వీడిన అడ్వకేట్ కిడ్నాప్ మిస్టరీ.. నిందితులు అరెస్ట్

by Bhanu |

వీడిన  అడ్వకేట్ కిడ్నాప్ మిస్టరీ.. నిందితులు అరెస్ట్
X

దిశ, వనస్థలిపురం: హైకోర్టుకు చెందిన సీనియర్ న్యాయవాది పాలడుగు నారాయణను కిడ్నాప్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేసిన ఇద్దరిని వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు సమయానుకూలంగా స్పందించి, నిందితులను రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే… వనస్థలిపురం డివిజన్‌లోని సరస్వతినగర్‌కి చెందిన ఎస్‌ఎన్‌ఆర్ అపార్ట్‌మెంట్‌లో నారాయణ (52) కుటుంబంతో నివసిస్తున్నారు. జూన్ 7న కోర్టుకు వెళ్లిన నారాయణ ఆ తర్వాత ఇంటికి తిరిగిరాలేదు.


ఆయన భార్య సువర్ణమ్మ జూన్ 8న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో తెల్లవారుజామున ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి “నీ భర్తను కిడ్నాప్ చేశాం, కోటి రూపాయలు ఇవ్వకపోతే చంపేస్తాం” అని బెదిరించాడని ఆమె పోలీసులకు తెలిపింది. వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్‌లో బెదిరించిన వ్యక్తిని వెంకటేశ్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఈ కిడ్నాప్ వెనుక 2020లో మేడ్చల్, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో జరిగిన భూ వివాదం ఉన్నట్లు పోలీసులు తేల్చారు.


అప్పట్లో నారాయణ మధ్యవర్తిగా వ్యవహరించి కోటి రూపాయలు తీసుకొని ఒక భూమిపై అగ్రిమెంట్ చేయించారని తెలుస్తోంది. అయితే, ఆ తర్వాత నారాయణ స్పందించకపోవడంతో వెంకటేశ్ కోపంతో కిడ్నాప్‌కు పాల్పడ్డాడని ఒప్పుకున్నాడు. ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు, ఘటన వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ మహేశ్ గౌడ్ వెల్లడించారు.

Next Story