- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళా భవనాలపై సీతక్క స్పెషల్ ఫోకస్.. లేట్ చేయొద్దని ఆదేశాలు
మహిళా గ్రామ సమాఖ్య భవనాల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మహిళా సమాఖ్య, అంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనులు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు, నిధుల వినియోగం, పురోగతిపై గురువారం సచివాలయంలో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు...

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా గ్రామ సమాఖ్య భవనాల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మహిళా సమాఖ్య, అంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనులు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు, నిధుల వినియోగం, పురోగతిపై గురువారం సచివాలయంలో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఇటీవల వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసిన 8 వేల మహిళా గ్రామ సమాఖ్య భవనాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ భవనాలు మహిళా సంఘాల ఆర్థిక, సామాజిక సాధికారతకు కేంద్ర బిందువులుగా మారనున్నాయని, నిర్ణీత గడువులోపు కనీసం 50 శాతం పనులు పూర్తయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. వీటితో పాటు గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ భవనాల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
నిధుల వినియోగంలో నిర్లక్ష్యం వద్దు..
ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. ప్రస్తుతం మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ. 589 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకుంటే అదనంగా మరో రూ. 600 కోట్ల నిధులు వచ్చే అవకాశం ఉందని వివరించారు. ఒక్క రూపాయి కూడా వెనక్కి వెళ్లకుండా జిల్లావారీగా స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని, జులై 1 నుంచి విబిజి రాంజీ అమలులోకి వస్తున్న నేపథ్యంలో, ఈ నెలాఖరులోపు అందుబాటులో ఉన్న నిధులను ఖర్చు చేయాలని ఆదేశించారు.
ఎస్సీ, ఎస్టీ కాలనీలపై ప్రత్యేక దృష్టి..
సామాజికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఇప్పటికీ సీసీ రోడ్లు లేని ఎస్సీ, ఎస్టీ కాలనీలను గుర్తించి, అక్కడ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి ఉపాధి హామీ నిధులను కేటాయించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న సీతక్క, క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టి, పనుల్లో జాప్యం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.






