ములుగు ప్రజల రుణం తీర్చుకుంటాం : మంత్రి సీతక్క.

by Bhanu |   (  Updated:2025-06-27 12:29:30  IST  )

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అర్హుడికీ ఇండ్లు మంజూరు చేయాలని కట్టుబడి ఉన్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.

ములుగు ప్రజల రుణం తీర్చుకుంటాం : మంత్రి సీతక్క.
X

దిశ, ములుగు ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అర్హుడికీ ఇండ్లు మంజూరు చేయాలని కట్టుబడి ఉన్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ములుగు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని ఆమె స్పష్టం చేశారు. శుక్రవారం ములుగు మండల కేంద్రం నుండి జీవింతరావుపల్లి గ్రామం మీదుగా గణేష్‌పల్లి వరకు రూ. 3.50 కోట్ల వ్యయంతో చేపట్టిన రోడ్డు విస్తరణ, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తొలి దశలో ప్రతి నియోజకవర్గానికి 5,000 ఇండ్లు కేటాయించింది అని, ములుగు నియోజకవర్గానికి నేను మంత్రి హోదాలో అదనంగా మరో 1,000 ఇండ్లను కేటాయించనున్నాను అని, అర్హులందరికీ ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి చర్యల్లో భాగంగా దశలవారీగా రోడ్ల విస్తరణ, ప్రతి గ్రామానికి రహదారులు వేసే కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ములుగు నియోజకవర్గంలోని అభివృద్ధి లేకున్న ప్రాంతాలను గుర్తించి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.

ములుగును మున్సిపాలిటీగా, మల్లంపల్లిని జేడి మల్లంపల్లి పేరుతో మండలంగా ఏర్పాటు చేశాం అని,ములుగును పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నాం అని, ఇది ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకే నిదర్శనం అని మంత్రి సీతక్క తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్, పంచాయతీరాజ్ ఈఈ అజయ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story