- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా వారోత్సవాలను విజయవంతం చేయాలి : మంత్రి సీతక్క
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 25 నుంచి 31 వరకు నిర్వహించనున్న మహిళా వారోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ సీతక్క అధికారులను ఆదేశించారు.

- మహిళల సాధికారతను ప్రతిబింబించేలా కార్యక్రమాలు నిర్వహించాలి
- బీఆర్ఎస్ నిలిపివేసిన వడ్డిలేని రుణాలు కొనసాగింపు
- సమర్థవంతంగా లోన్ భీమా పథకాలు
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 25 నుంచి 31 వరకు నిర్వహించనున్న మహిళా వారోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ సీతక్క అధికారులను ఆదేశించారు. ప్రతి రోజు భిన్న రంగాల్లో మహిళలు సాధిస్తున్న విజయాలను చాటి చెప్పే విధంగా షెడ్యుల్ రూపొందించాలన్నారు. కనీసం 4 వేల గ్రామాల్లో మహిళా భవనాల నిర్మాణానికి శంకు స్థాపన జరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖలపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళా సంఘ సభ్యుల విజయగాథలను ప్రజల ముందుకు తీసుకురావాలని సూచించారు. సీఎం చేతుల మీదుగా మహిళా సాధికారత, మహిళా విజయాల ఆవిష్కరణ ఉంటుందన్నారు.
బీఆర్ఎస్ నిలిపివేసిన వడ్డిలేని రుణాలు కొనసాగింపు
ఐదేళ్లలో రూ.1 లక్ష కోట్ల క్రెడిట్ లింకేజ్ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. గత రెండేళ్లలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి రూ.60,487 కోట్ల బ్యాంకు లింకేజ్ సాధించడం ద్వారా మహిళల ఆర్థిక భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందన్నారు. బీఆర్ఎస్ హయంలో నిలిచిపోయిన వడ్డీ లేని రుణాల పథకాన్ని తిరిగి ప్రారంభించామని తెలిపారు. .
సమర్థవంతంగా లోన్ భీమా పథకాలు
మహిళా సంఘ సభ్యులకు భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోన్ భీమా, ప్రమాద భీమా పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని మంత్రి తెలిపారు. సభ్యురాలి మరణం సంభవించినప్పుడు రూ. 2 లక్షల వరకు రుణ భీమా రక్షణ అందిస్తున్నామని, ఇప్పటివరకు 2,993 క్లెయిమ్‌లకు రూ.23.72 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. ప్రమాద మరణాలపై రూ.10 లక్షల భీమా అందించే ప్రమాద భీమా పథకం కింద 228 క్లెయిమ్‌లకు రూ.22.28 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. జిల్లా సమాఖ్యల కోసం రూ.110 కోట్లతో 22 ఇందిరా మహిళా శక్తి భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు.
క్యాంటిన్ల ద్వారా నెలకు 72 వేల లాభం
మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న 222 క్యాంటీన్లు ఒక్కో యూనిట్‌కు నెలకు సగటున రూ.72 వేల లాభం ఆర్జిస్తూ 4 నుంచి 5 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాయని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి బజార్ ద్వారా మహిళా వ్యాపారవేత్తలకు మార్కెట్ అవకాశాలు విస్తరించాయని, 106 రిటైల్ దుకాణాల ద్వారా కోట్ల వ్యాపారాలు చేస్తున్నారని తెలిపారు. మహిళా సంఘాల సమాఖ్యలు రూ.200 కోట్ల పెట్టుబడితో 593 బస్సులను కొనుగోలు చేసి నిర్వహిస్తున్నాయని, ఒక్కో బస్సు ద్వారా నెలకు సగటున రూ.69 వేలకుపైగా ఆదాయం వస్తోందని వివరించారు. గత ఏడాది 3195 వరి కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలు నిర్వహించి రూ.158 కోట్ల కమిషన్ ఆర్జించాయని తెలిపారు.
పెట్రోల్ బంకుల ద్వారా రూ.7 లక్షల ఆదాయం
మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంకులు నెలకు రూ.6 నుంచి 7 లక్షల వరకు ఆదాయం సాధిస్తున్నాయని, మొదటి యూనిట్ ఆరు నెలల్లోనే రూ.13.82 లక్షల లాభం సాధించిందని చెప్పారు. మరో 30 పెట్రోల్ బంకుల ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం 77,670 మంది దివ్యాంగులు, 83,325 మంది వృద్ధ మహిళలు, లక్ష మంది కిశోర బాలికలు ప్రత్యేక సంఘాల ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ దానకిషోర్, పంచాయతీరాజ్ కమిషనర్, సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా తదితర అధికారులు పాల్గొన్నారు.






