ప్రభుత్వం తరఫున క్షమాపణ చెబుతున్నా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్

by Prasad Jukanti |

ధాన్యం సేకరణ ఆలస్యం కావడంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రైతులకు క్షమాపణలు చెప్పారు. 10 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.

ప్రభుత్వం తరఫున క్షమాపణ చెబుతున్నా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ధాన్యం సేకరించే విషయంలో కొంత ఆలస్యం జరిగిందని అంగీకరించారు. ఈ విషయంలో ప్రభుత్వం తరఫున తాను క్షమాపణలు కోరుతున్నానన్నారు. ఇవాళ మునుగోడులో మీడియాతో మాట్లాడిన ఆయన.. పశ్చిమబెంగాల్‍లో ఎన్నికల వల్ల హమాలీల కొరత, కొంత మంది మిల్లర్ల రాజకీయంగా బ్లాక్ మెయిలింగ్ ధోరణిలో వ్యవహరించడం వల్ల ధాన్యం సేకరించే విషయంలో ఆలస్యం అయిందన్నారు. దీంతో రైతులు ఇబ్బంది పడ్డారని ఈ విషయంలో తామంతా చింతిస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. రాబోయే 10 రోజుల్లో రైతుల వద్ద ఉన్న పూర్తి ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదని గతంతో పోలిస్తే ఈ సారి ధాన్యం దిగుబడి రెట్టింపు అయిందని చెప్పారు. రైతు సోదరులు పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు. ప్రతిపక్షాలు చేసిన పోరాటాలను ప్రభుత్వం సానుకూల ధోరణిలోనే చూస్తోందన్నారు. ఇది రైతుల సమస్య అని ప్రతిపక్షాలు, ప్రభుత్వం సహకారంతో ముందుకు వెళ్తే పది రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తవుతుందని చెప్పారు.

ధాన్యం సేకరణపై పొలిటికల్ దుమారం:

రాష్టరంలో ధాన్యం సేకరణపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయ దుమారం రేగింది. రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ మేరకు ఇవాళ బీజేపీ బస్సు యాత్ర ప్రారంభించగా బీఆర్ఎస్ నేతలు కల్లాల వద్దకు వెళ్లి అక్కడ పరిస్థితిని పరిశీలించారు. ధాన్యం సేకరణ విషయంలో ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదని బీజేపీ విమర్శించగా, ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయకపోతే.. కలెక్టరేట్‌ ముట్టడిస్తామని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రతిపక్షాల విమర్శలపై స్పందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. రైతులను అడ్డం పెట్టి బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతోందని ఫైర్ అయ్యారు.

Next Story