HYD: దసరా, దీపావళికి సొంతూళ్లకు వెళ్తున్నారా?.. ఈసారి సికింద్రాబాద్‌లో నో ట్రైన్స్!

by Gantepaka Srikanth |

సాధారణంగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విపరీతమైన ప్రయాణికుల రద్దీ ఉంటుంది.

HYD: దసరా, దీపావళికి సొంతూళ్లకు వెళ్తున్నారా?.. ఈసారి సికింద్రాబాద్‌లో నో ట్రైన్స్!
X

దిశ తెలంగాణ బ్యూరో: సాధారణంగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విపరీతమైన ప్రయాణికుల రద్దీ ఉంటుంది. దసరా, దీపావళి పండుగల సమయంలో ఊహించని స్థాయిలో ప్రయాణికుల సందడి ఉంటుంది. తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను రూ.700 కోట్లతో ఆధునీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడి నుంచి అనేక రైళ్లను చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి, మల్కాజ్ గిరి, ఉందానగర్ తదితర స్టేషన్లకు తరలించారు. ఈ స్టేషన్లో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్న నేపథ్యంలో ఇంకా మరిన్ని రైళ్లను మళ్లించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. దసరా, దీపావళి సందర్భంగా నగరం నుంచి వివిధ ప్రాంతాలకు నడిపే ప్రత్యేక రైళ్లను సైతం సికింద్రాబాద్ నుంచి కాకుండా ఇతర స్టేషన్ల నుంచి నడిపేందుకు కసరత్తు చేస్తున్నారు.

సికింద్రాబాద్ స్టేషన్‌లో భారీ రద్దీ

సికింద్రాబాద్ స్టేషన్‌లో సాధారణ రోజుల్లో రోజుకు 1.3 లక్షల మంది ప్రయాణికులు.. పండుగ రోజుల్లో రోజుకు 2 లక్షలకు పైగా ప్రయాణికులు వస్తుంటారు. స్టేషన్ లోపల ప్రయాణీకుల రద్దీని తగ్గించేందుకు ఓ అధ్యయనం చేశారు. సాధారణంగా ఈ స్టేషన్‌లో ప్లాట్ ఫారం-1 ద్వారా ప్రయాణీకులు ఎంటర్, ఎగ్జిట్ అవుతారు. రిజర్వేషన్ లేని ప్రయాణికులలో దాదాపు 80-90 శాతం మంది ఈ మార్గం ద్వారానే వచ్చి పోతుంటారు. ప్లాట్ఫారం 10 వైపు స్టేషన్‌తో పోలిస్తే ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు, హోటళ్లతో కళకళలాడుతుంటుంది.

స్టేషన్ లోపల రద్దీని తగ్గించేందుకు..

రద్దీ సమయాల్లో కొన్ని రైళ్లను సనత్‌నగర్-అమ్ముగూడ-మౌలాలీ-చర్లపల్లి మీదుగా మళ్లించడం, చర్లపల్లి వంటి శాటిలైట్ స్టేషన్లలో అదనపు హాల్ట్‌లను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పలు రైళ్లను కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి తదితర స్టేషన్లకు తరలించారు. ఇక సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రస్తుతం తాత్కాలికంగా వెయిటింగ్ ఏరియాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్లాట్ఫారం 1 నుండి సికింద్రాబాద్ (వెస్ట్) మెట్రోకు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక రెగ్యులర్ గా వచ్చే కార్లు, టాక్సీలలో ప్రయాణించే వారు ప్లాట్ఫారం 1 వైపు కాకుండా ప్లాట్ఫారం 10ను ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్లాట్ ఫారం 1 వైపు పికప్, డ్రాప్ కోసం పరిమితంగా మాత్రమే వినియోగించుకోవాలని కోరుతున్నారు.

Next Story