ఎయిర్‌పోర్ట్‌ను తలపిస్తోన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

by Gantepaka Srikanth |

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విమానాశ్రయం తరహాలో సిద్ధమవుతోందని.. ఈ ఏడాది చివరి నాటికి పనులు పూర్తవుతాయని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు.

ఎయిర్‌పోర్ట్‌ను తలపిస్తోన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విమానాశ్రయం తరహాలో సిద్ధమవుతోందని.. ఈ ఏడాది చివరి నాటికి పనులు పూర్తవుతాయని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న పునరాభివృద్ధి పనులను శనివారం ఆయన సమగ్రంగా తనిఖీ చేశారు. జీఎం వెంట దక్షిణ మధ్య రైల్వే కన్‌స్ట్రక్షన్ సీఏఓ ఎం. రణధీర్ రెడ్డి, సికింద్రాబాద్ డివిజనల్ డీఆర్ఎం గోపాలకృష్ణన్ ఆర్ ఉన్నారు. స్టేషన్‌లో జరుగుతున్న పునరాభివృద్ధి పనులను జీఎం వివరంగా సమీక్షించారు. రైల్వే స్టేషన్ కు రెండు వైపులా.. ప్లాట్‌ఫామ్ నెం. 1 మరియు ప్లాట్‌ఫామ్ నెం. 10 వైపున జరుగుతున్న పునరాభివృద్ధి పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాళ్లు, ప్లాట్‌ఫామ్‌ల పనుల పురోగతిని ఆయన తనిఖీ చేశారు. నిర్మాణ పనులు చేపట్టనున్న బుకింగ్ ఆఫీస్, పార్కింగ్, స్టేషన్ ప్రాంగణాలకు సంబంధించిన పనులను సైతం ఆయన పరిశీలించారు.


జనరల్ మేనేజర్‌కు పునరాభివృద్ధి పనులకు సంబంధించిన ప్రణాళికలు, పురోగతిలో ఉన్న పనులను గురించి అధికారులు వివరించారు. స్టేషన్ పనులను, ప్రయాణికుల సౌకర్యాలను సకాలంలో పూర్తి చేయడానికి పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. భద్రతచర్యలు పాటిస్తూనే ప్రయాణికుల సులభమైన రాకపోకలను కల్పించడానికి తీసుకున్న సమగ్ర చర్యలపైనా జాగ్రత్తలు తీసుకునాలన్నారు. ప్రధాన మౌలిక సదుపాయాల మార్పులతో కూడిన పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్న సమయంలో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకునాలని ఆదేశించారు. కాగా... ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు 60శాతం పూర్తయ్యాయని అధికారులు జీఎం దృష్టికి తీసుకుపోయారు. ఇందులో కీలకమైన నిర్మాణ పనులే ఉన్నాయని... మిగతా 40శాతం పనులు చేసే క్రమంలో రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం ఎదురుకాదని తెలిపారు.

Next Story