- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సికింద్రాబాద్ బీజేపీకి ఎదురుగాలి! అభ్యర్థి సారంగపాణి తీరుతో డిపాజిట్ కష్టమేనా..?
సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి ఓటమి తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి.

దిశ, సికింద్రాబాద్ : సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి ఓటమి తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కదేమోనని స్వంత పార్టీ నాయకులే గుసగుసలాడుతున్నారు. గతంతో పోలిస్తే నియోజకవర్గంలో బీజేపీ పుంజుకున్నప్పటికీ, ముచ్చటగా మూడు పార్టీలు మారిన బీజేపీ అభ్యర్థి మేకల సారంగపాణి తీరుతో ప్రస్తుత పరిస్థితి అగమ్యగోచరంగా మారిందనే మాటలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. ఎంతో ఉత్సాహంతో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం ఓటమి తప్పదనే భావిస్తున్నారు.
వరుసగా రెండుసార్లు గెలిచి, అంగబలం, ధనబలం కలిగిన బీఆర్ఎస్ అభ్యర్థి ఒకవైపు, ధనబలం కలిగిన కాంగ్రెస్ అభ్యర్ధి మరోవైపు.. వీరిని తట్టుకొనే శక్తిలేని సారంగపాణికి పార్టీ టికెట్ కేటాయించడం పట్ల మరికొందరు నిరుత్సాహపడుతున్నారు. బలమైన బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులతో పోటీపడే స్థాయి సారంగపాణికి లేదని, గెలుపు పక్కనపెడితే, డిపాజిట్ కూడా కష్టమేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
పార్టీకి దూరమైన వారి ప్రభావం..
టికెట్ ఆశించి భంగపడ్డ పార్టీ నాయకుల్లో ఒకరు బండపల్లి సతీష్ పార్టీకి రాజీనామా చేయగా, మరొకరు నిరుత్సాహంతోనే కొనసాగుతున్నారు. సారంగపాణి కన్నా ముందే పార్టీలో చేరి, 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఎన్ఆర్ఐ బండపల్లి సతీష్‌ను ఈసారి పక్కనపెట్టడంతో, ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఆయన అనుచరులు కొందరు పార్టీకి దూరం ఉండగా, మరికొంత మంది ఉన్నామా లేమా అన్నా చందంగా నడుస్తున్నారు. మరోపక్క టికెట్ ఆశించిన మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి కూడా పూర్తి స్థాయిలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అభ్యర్థి ఓటమికి ఇదో కారణం అవుతుందని పలువురి వాదన.
ప్రజలు పట్టం కట్టేనా..
ముచ్చటగా మూడు పార్టీలు మారిన ప్రస్తుత బీజేపీ అభ్యర్థి సారంగపాణికి సికింద్రాబాద్ ప్రజలు పట్టం కడతారా అనేది చర్చనీయాంశంగా మారింది. పోయిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సారంగపాణి ఇంటి నుంచి బౌద్ధనగర్ డివిజన్ కార్పొరేటర్‌గా పోటీ చేసిన ఆయన కోడలు ఓడిపోయింది. దీంతో కార్పొరేటర్‌ను గెలిపించుకోలేని సారంగపాణి ఎమ్మెల్యేగా ఎలా గెలుస్తాడని పలువురు సొంత పార్టీ నాయకులే గుసగుసలాడుతున్నారు. దీనికి తోడు ప్రచార కార్యక్రమాల్లో సైతం అంతగా ఆర్భాటం కనిపించడం లేదు. ఇంత జరుగుతున్నా అభ్యర్థి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, బీజేపీ నాయకుల్లో మాత్రం అది కనిపించడం లేదు.
అభ్యర్థి తీరుపట్ల నిరుత్సాహం..
అభ్యర్థి వ్యవహరిస్తున్న తీరు పట్ల కార్యకర్తలు నిరుత్సాహపడుతున్నారు. అభ్యర్థిలో ఆశించినంతగా ఉత్సాహం కనిపించడం లేదని వారు వాపోతున్నారు. అందరిని కలుపుకొనిపోకుండా అంతా తానే అన్నట్టు నడుస్తున్నాడనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఇది సరైనపద్ధతి కాదని పలువురు పార్టీ నాయకులు వాపోతున్నారు.
సీనియర్ నాయకులు దూరం..
పార్టీ ప్రచార కార్యక్రమాలకు పలువురు సీనియర్ నాయకులు దూరంగా ఉంటున్నారు. అభ్యర్థి తీరు నచ్చకనే దూరంగా ఉంటున్నట్లు వారు చెప్తున్నారు. మరికొంతమంది ఏదో వచ్చామా వెళ్లామా అనే తీరుగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నువ్వానేనా అన్నట్టు తలపడుతుండగా, బీజేపీలో సఖ్యత కరువై అభ్యర్ధి తానే అన్ని అయి కొనసాగిస్తున్నాడు.






