STFI: విద్యాహక్కు చట్టం సెక్షన్‌ (23)ను సవరించాలి.. ఎస్టీఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డిమాండ్‌

by Ramesh Naini |

టెట్ ఉత్తీర్ణత పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నుంచి ఇన్ సర్వీస్ టీచర్లకు రక్షణ కల్పించాలని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) జాతీయ ప్రధాన కార్యదర్శి చావ రవి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

STFI: విద్యాహక్కు చట్టం సెక్షన్‌ (23)ను సవరించాలి.. ఎస్టీఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డిమాండ్‌
X

దిశ, తెలంగాణ బ్యూరో: టెట్ ఉత్తీర్ణత పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నుంచి ఇన్ సర్వీస్ టీచర్లకు రక్షణ కల్పించాలని (School Teachers Federation of India) స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) జాతీయ ప్రధాన కార్యదర్శి చావ రవి (Death Ravi) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకోసం విద్యాహక్కు చట్టం సెక్షన్ 23ను సవరించాలని ఆయన కోరారు. అలాగే, టెట్ సిలబస్, అర్హత ప్రమాణాలను శాస్త్రీయంగా మార్చాలని ఎన్సీటీఈని డిమాండ్ చేశారు. ఈనెల 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్న ఇన్ సర్వీస్ టీచర్లందరూ రెండేళ్లలో టెట్ పాస్ కావాలి, లేదంటే ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఈ తీర్పు సీనియర్ టీచర్లలో ఆందోళన కలిగిస్తోందని, దీనిని నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేయాలని చావ రవి డిమాండ్ చేశారు. 2010 కి ముందు నియమితులైన టీచర్లకు టెట్ మినహాయింపు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, 15 ఏళ్ల తర్వాత హఠాత్తుగా పరీక్ష పాస్ కావాలని చెప్పడం సరికాదన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌ యూటీఎఫ్‌) రాష్ట్ర కార్యాలయం దోమలగూడలో చావ రవి అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జాతీయ విద్యా విధానాన్ని సవరించాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని, ఆదాయ పన్ను పరిమితిని పెంచాలని, సమగ్ర శిక్షా ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వాలని వంటి పలు డిమాండ్లపై దేశవ్యాప్త ప్రచారంలో భాగస్వాములు కావాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.

ఇతర డిమాండ్లు..

ఈ సందర్భంగా టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. వెంకట్ మాట్లాడుతూ, రెండేళ్లలో వీలైనన్ని ఎక్కువ సార్లు టెట్ పరీక్ష నిర్వహించి అందరూ పాస్ అయ్యేలా అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. డిగ్రీ, బీఈడీ అర్హతలతో ఎస్జీటీలుగా నియమితులైన వారికి ఓడీఎల్ పద్ధతిలో డీఈడీ స్వల్పకాలిక శిక్షణ ఇచ్చి, టెట్ పేపర్ 1 రాయడానికి అర్హత కల్పించాలని డిమాండ్ చేశారు. గురుకులాల టైమ్ టేబుల్ మార్చాలని, కేజీబీవీ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కూడా ఆయన కోరారు. సమావేశంలో టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఇతర రాష్ట్ర కమిటీ సభ్యులు, వివిధ జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభంలో ఇటీవల మరణించిన సీపీఐ జాతీయ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి, యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జియావుద్దీన్ అహ్మద్‌లకు నివాళులర్పించారు.

Next Story