సెటిల్‌మెంట్లకు అడ్డాగా సెక్రటేరియట్! చక్రం తిప్పుతోన్న అసిస్టెంట్ సెక్రటరీ స్థాయి అధికారి

by Kema Shiva Kumar |

సీఎం మంచితనాన్ని ఆసరాగా తీసుకొని కొన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

సెటిల్‌మెంట్లకు అడ్డాగా సెక్రటేరియట్! చక్రం తిప్పుతోన్న అసిస్టెంట్ సెక్రటరీ స్థాయి అధికారి
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం మంచితనాన్ని ఆసరాగా తీసుకొని కొన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్స్, పదోన్నతులకు భారీగా డబ్బులు డిమాండ్ చేయడమే కాకుండా.. సెక్రెటేరియట్‌లోనే ఇలాంటి వ్యవహారాలను చక్కబెడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అడిగినంత ఇవ్వకపోతే ఎక్కడ తమ పదోన్నతులు ఆగిపోతాయేమోనన్న ఆందోళనతో ఉద్యోగులు సైతం ముడుపులు ఇస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. తాజాగా పంచాయతీ రాజ్ శాఖలో అసిస్టెంట్ సెక్రెటరీ హోదాలో పని చేస్తున్న ఓ అధికారి తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గతంలో ఉన్నత విద్యాశాఖలో పదేండ్లుగా ఇలాగే వ్యవహరించడంతో ఆ అధికారిని.. గిరిజన సంక్షేమం, జీఏడీకి బదిలీ చేశారు. అయితే ఆ తర్వాత పెద్ద రెఫరెన్స్ పై ఆయన పంచాయతీరాజ్ శాఖకు వచ్చి.. మళ్లీ అదే తీరులో వ్యవహరిస్తున్నట్లు చర్చ జరుగుతున్నది.

సాయంత్రం ఐదు గంటల తర్వాత..

వివిధ పనుల నిమిత్తం పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంపీడీవోలు, జిల్లా పరిషత్ సీఈఓలు, డిప్యూటీ సీఈఓలు తరచుగా సెక్రెటేరియట్‌కు వస్తుంటారు. వీరందరి ఫైళ్లు ముందుకు కదలాలంటే భారీగా ముడుపులు డిమాండ్ చేస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. తనశాఖకు చెందిన కొంత మందిని ప్రత్యేకంగా నియమించుకొని సచివాలయంలోనే సెటిల్మెంట్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వివిధ పనులకు సంబంధించి ఫైళ్ల సమాచారాన్ని ముందుగానే చెప్పి.. పై అధికారులతో సమన్వయం చేసి న్యాయం జరిగేలా చూస్తానని డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. తనకు అనుకూలమైన ఓ వ్యక్తి ద్వారా.. సాయంత్రం ఐదు తర్వాత సెక్రెటేరియట్ లోనే అడ్డా పెడుతున్నట్లు డిపార్ట్ మెంట్ వర్గాలు చెప్తున్నాయి. వీరందరి సర్వీస్ మ్యాటర్స్ ను ఆ అధికారి అన్నీ తానై చూస్తుండడంతో.. చేసేదేమి లేక ముడుపులు ఇవ్వాల్సి వస్తున్నదని బాధితులు వాపోతున్నారు.

ముడుపులు ఇవ్వకుంటే అడ్డంకులు

ఎంపీడీఓ నుండి డిప్యూటీ సీఈఓగా పదోన్నతి పొందే ఓ అధికారి విషయంలో నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. బదిలీలపై నిర్ణయం తీసుకునే అంశంలో ఏఎస్ఓలు, ఎస్ఓలు తన పరిధిలోనే ఉండాలని ఆదేశాలు ఇస్తూ.. ఆ అధికారి అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. తనకు అనుకూలంగా నోటింగ్ మార్చాలని ఎస్ఓ, ఏఎస్ఓలను బెదిరిస్తున్నారని వాపోతున్నారు. ఒకవేళ ఆ నోటింగ్ తనకు అనుకూలంగా లేకపోతే.. ఉన్న నోట్ ఫైల్ ను పక్కన పెట్టి సొంతగా తయారు చేసిన నోట్ ఫైళ్లను నేరుగా సెక్రెటరీకి పంపుతున్నట్లు తెలిసింది. డబ్బులు ముడితే సీఎం లేదా మినిస్టర్ స్థాయిలో కావాల్సిన వాటిని సైతం తానే క్లియర్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ డబ్బులు రాకపోతే సెక్రెటరీ స్థాయిలో క్లియర్ కావాల్సిన వాటిని సైతం కావాలనే సీఎం, మినిస్టర్ కు రాస్తూ తిరకాసు పెడుతున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. డిసెంబర్ వరకు తన పదవీకాలం ఉందని, అప్పటి వరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని ఆ అధికారి చెబుతున్నట్లు చర్చ జరుగుతున్నది. ఇప్పటికైనా ఆ శాఖ మంత్రి, ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించాలని ఉద్యోగులు కోరుతున్నారు.

Next Story