KCR America Tour: కేసీఆర్ అమెరికా టూర్ వెనక రహస్య ఎజెండా!.. రేవంత్ రెడ్డికి నెటిజన్ల కీలక విజ్ఞప్తి

by Prasad Jukanti |   (  Updated:2025-05-03 11:54:17  IST  )

కేసీఆర్ అమెరికా టూర్ అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిగ్ గా మారింది.

KCR America Tour: కేసీఆర్ అమెరికా టూర్ వెనక రహస్య ఎజెండా!.. రేవంత్ రెడ్డికి నెటిజన్ల కీలక విజ్ఞప్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) విదేశీ పర్యటనపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. త్వరలో ఆయన అమెరికాకు వెళ్లనున్నారని, తన మనవడి గ్రాడ్యుయేషన్ డే కు హాజరయ్యేదుకు యూఎస్ వెళ్లబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు వీసా కోసం శుక్రవారం నానక్ రాంగూడలోని అమెరికన్ కాన్సులెట్ కు కేసీఆర్ హాజరు కావడంతో అమెరికా టూర్ (KCR America tour) అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే పైకి కేసీఆర్ తన మనవడి కాలేజీ ప్రోగ్రామ్ కోసం అమెరికా వెళ్తున్నారనే ప్రచారం ఉన్నా ఈ టూర్ వెనుక రహస్య ఎజెండా ఉందనే అభిప్రాయాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

రేవంత్ రెడ్డి.. కేసీఆర్ పై నిఘా పెట్టండి:

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు (phone tapping case) ఓ సంచలనం. ఈ కేసు విచారణ ఇప్పుడిప్పుడే కీలక దశకు వస్తోంది. ఈ కేసులో ఏ 1 గా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా లో ఉండగా ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. మరో వైపు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎన్డీఎస్ఏ రిపోర్టు, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ, గొర్రెల స్కామ్ కేసు అంశాల దర్యాప్తు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఈ క్రమంలో గులాబీ బాస్ అమెరికా టూర్ పెట్టుకోవడం వెనుక హిడెన్ ఎజెండా ఉండే ఉంటుందనే సందేహాలు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు వరుసగా దర్యాప్తుకు హాజరవుతున్నారు. మరో వైపు ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావుకు ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు జారీ అయ్యాయి. అతడి పాస్ పోర్టు రద్దు చేయడంతో తప్పనిసరిగా ఇండియా కు రావలసిన పరిస్థితి వచ్చింది. అదే జరిగితే తనకు చాలా ప్రమాదం అని భావించిన కేసీఆర్ ప్రభాకర్ ను స్వదేశానికి రానివ్వకుండా నచ్చజెప్పే ప్రయత్నించడానికే అమెరికా వెళ్తున్నారని సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసు ద్వారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చాలా నష్టపోయారని అందువల్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేసీఆర్ అమెరికా పర్యటన మీద సమీక్ష చేసి నిఘా పెట్టాలని సోషల్ మీడియాలో ఓ వ్యక్తి చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది.

సారెళ్తే వచ్చేది ఎప్పుడో:

ఇటీవల వరంగల్ సభ తర్వాత తాను మళ్లీ ప్రజల్లోకి వచ్చి ప్రజల పక్షాన కొట్లాడుతానని కేసీఆర్ చెప్పారు. ఇంతలో అమెరికా టూర్ వెళ్లాలనే ఆలోచనతో ఉన్నారనే ప్రచారం జరుగుతుండటంతో ఈ అంశం బీఆర్ఎస్ పార్టీలోనూ చర్చగా మారినట్లు తెలుస్తోంది. ఓ వైపు కేటీఆర్ గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. మరో వైపు కవిత కామెంట్స్ పార్టీలో దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ అమెరికా టూర్ ఎప్పుడు వెళ్లబోతున్నారు? వెళ్తే తిరిగి ఎప్పుడు వస్తారు అనే చర్చ పార్టీ నేతల మధ్య జోరుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి ప్రచారం జరుగుతున్నట్లుగా కేసీఆర్ అమెరికా టూర్ నిజంగానే ఉండబోతున్నదా? ఉంటే ఎప్పటి వరకు అనేది గులాబీ బాసే క్లారిటీ ఇవ్వాలి.

Next Story