ముగిసిన రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం

by Ramesh Naini |   (  Updated:2025-12-12 13:26:54  IST  )

తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగిసింది.

ముగిసిన రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ఉత్సాహం క్రమంగా టెన్షన్‌గా మారుతోంది. ప్రచార డప్పులు మోగడం ఆగిపోవడంతో, ఇప్పుడు అభ్యర్థులు, కార్యకర్తలు పోలింగ్ రోజు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 14న రెండో విడత ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రెండో విడత గ్రామ పంచాయతీ పోలింగ్ జరగనుంది.

రెండో విడతలో 3911 సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో విడత లో 57 లక్షల 22 వేల 665 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందులో 27 లక్షల 96 వేల 6 మంది పురుషులు, 29 లక్షల 26 వేల 506 మంది మహిళా ఓటర్లు, 153 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. ఇక, 193 మండలాలలో అధికారులు 38 వేల 337 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం 6 నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు రెండో విడత గ్రామపంచాయతీలో మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు బంద్ కానున్నాయి.

పోలింగ్ ముగిసిన వెంటనే, అదే రోజు మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ ప్రారంభమై, అనంతరం ఫలితాలు ప్రకటించనున్నారు. కాగా, తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు సత్తా చాటారు. మొత్తం 3,836 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగ్గా కాంగ్రెస్ 2,383 బీఆర్ఎస్ 1,146, బీజేపీ 181, ఇతరులు-455 సీట్లను కైవసం చేసుకున్నారు. తొలి విడతలో మొత్తం పోలింగ్ 84.28 శాతం నమోదు కాగా.. యాదాద్రిలో అత్యధికంగా 92.88 శాతం పోలింగ్ నమోదైంది.

Next Story