దోస్త్ @56,147... మొదటి విడతలో సీట్ల కేటాయింపు

by Ajay Maddhiboyina |

డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) మొదటి విడతలో 56,147 మందికి డిగ్రీ సీట్లు దక్కాయి. అత్యధికంగా 23,214 మంది కామర్స్ లో సీట్లు పొందారు. తర్వాత స్థానం ఫిజికల్ సైన్స్ లో 14,394 మంది సీట్లు సాధించారు.

దోస్త్ @56,147... మొదటి విడతలో సీట్ల కేటాయింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) మొదటి విడతలో 56,147 మందికి డిగ్రీ సీట్లు దక్కాయి. అత్యధికంగా 23,214 మంది కామర్స్ లో సీట్లు పొందారు. తర్వాత స్థానం ఫిజికల్ సైన్స్ లో 14,394 మంది సీట్లు సాధించారు. గురువారం తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, దోస్త్ బృందంతో కలిసి మొదటి విడత సీట్ల కేటాయింపు వివరాలతో పాటు రెండో విడత షెడ్యూల్‌ను వెల్లడించారు. మొత్తం సీట్లు పొందిన వారిలో అమ్మాయిలు 36,302 మంది, అబ్బాయిలు 19,845 మంది ఉన్నారు. రాష్ట్రంలోని 777 ప్రభుత్వ, యూనివర్శిటీ కాలేజీల్లో 3,60,709 సీట్లు ఉండగా, అందులో 56,147 సీట్లు భర్తీఅయ్యాయి. 116 ప్రభుత్వ కాలేజీల్లో 50,760 సీట్లకు గానూ 8,079మందికి సీట్లు లభించాయి. 36 ప్రభుత్వ అటానమస్ కాలేజీల్లో అత్యధికంగా 19,774 మంది విద్యార్థులు సీట్లు పొందారు. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కాలేజీల్లో అత్యధికంగా 577 కళాశాలలు ఉన్నప్పటికీ, కేవలం 16,633 మంది విద్యార్థులు మాత్రమే ఇక్కడ సీట్లు పొందడం గమనార్హం. యూనివర్సిటీ అనుబంధ కాలేజీల్లోని 3,950 సీట్లకు గానూ 3,495 సీట్లు భర్తీఅయ్యాయి.

ఒక్కరూ చేరని కాలేజీలు

రాష్ట్రవ్యాప్తంగా 79 కాలేజీల్లో విద్యార్థులు ఏ ఒక్కరూ చేరలేదన్నారు. అత్యధికంగా 99.50 శాతం మార్కులతో దోస్త్ లో మొదటి ర్యాంకు సాధించిన పబ్బ సృజన ఫిజికల్ సైన్స్ కోర్సు ఎంచుకుని నిజాం కాలేజీలో సీటు పొందింది. రెండవ ర్యాంక్ బోడపోతుల కిరణ్ గౌడ్ 99.50 శాతం మార్కులతో కామర్స్ అండ్ మేనేజ్ మెంట్ కోర్సులో నిజాం కాలేజీలో సీటుపొందాడు. థర్డ్ ర్యాంకు ఫిజికల్ సైన్స్ లో బండి శశికుమార్ 99.50 శాతం మార్కులు, 4వ ర్యాంకు ఫిజికల్ సైన్స్ లో చాకలి ఐలమ్మ యూనివర్శిటీ నుంచి షేక్ సమీరా 99.50 శాతం మార్కులతో 4వ ర్యాంకు సాధించింది. 99.50 శాతం మార్కులతో అక్సా తరణం జహీరాబాద్ లోని ఆచార్య డిగ్రీ కాలేజీలో లైఫ్ సైన్స్ విభాగంలో సీటు పొందింది. టాప్ ర్యాంకర్లలో కొందరు ఇంజినీరింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది.

సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు, వెబ్ సెలక్షన్స్ ఈ నెల 15 నుంచి 26 వరకు కొనసాగుతాయని, మే 30న సెకండ్ ఫేజ్ సీట్లు కేటాయింపు ఉంటుందని దోస్త్ కన్వీనర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఈనెల 23లోపు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి విద్యార్థులు సీటు రిజర్వ్ చేసుకోవాలని సూచించారు. లేనిపక్షంలో సీటు రద్దవుతుందన్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, యూనివర్శిటీ కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజ్ లో ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా పొందిన సీట్లను, సంబంధిత కాలేజీలకు జూన్ 20 నుంచి జూన్ 27 వరకు వెళ్లి రిపోర్ట్ చేయాలని, కాలేజీలకు హాజరుకాని అభ్యర్థుల సీటు రద్దవుతుందని స్పష్టం చేశారు.

Next Story