రేపు పాఠశాలల రీఓపెనింగ్

by Muthe.Rajitha |

వేసవి సెలవులు ముగిశాయి. విద్యార్థులంతా తిరిగి బడిబాట పట్టనున్నారు.

రేపు పాఠశాలల రీఓపెనింగ్
X

దిశ,తెలంగాణ బ్యూరో: వేసవి సెలవులు ముగిశాయి. విద్యార్థులంతా తిరిగి బడిబాట పట్టనున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేట్ బడులు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత విద్యా సంవత్సరం ఏప్రిల్ 23 వ తేదీతో ముగియగా అప్పటి నుంచి వేసవి సెలవులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రంలోని విద్యార్థులు బడిబాట పట్టనున్నారు. ప్రతిరోజు ప్రార్థన సమయంలో లేదా పూర్తయ్యాక విద్యార్థులకు ఈ ఏడాది నుంచి యోగా లేదా ధ్యానం నిర్వహించాలని అకాడమిక్ క్యాలెండర్ లో ప్రకటించారు. అరగంట పాట పిల్లలతో కథలు లేదా పత్రికలు చదివించనున్నారు. అలాగే ప్రతినెలా మూడో శనివారం నో బ్యాగ్ డే గా నిర్వహించనున్నారు. ఈ సారి మొత్తం 230 రోజుల పాటు తరగతులు జరుగుతాయి. ఇంతవరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫాం, పాఠ్య పుస్తకాలు అందజేస్తున్నారు. ఈ సారి కొత్తగా 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు నోట్ బుక్స్ ఇవ్వాలని నిర్ణయించింది.

గత 5-6 నెలల్లో విద్యాశాఖ చేపట్టిన కార్యక్రమాలు:

విద్యా సంవత్సరం 2025-26 ప్రారంభమయ్యే రోజునే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లు, నోట్‌బుక్‌లు, యూనిఫాంలు అందించనున్నారు. 1 నుంచి 5 తరగతుల ప్రాథమిక తరగతుల విద్యార్థులకు మొదటిసారిగా నోట్‌బుక్‌లు కూడా ఈ ఏడాది నుంచి ఇవ్వనున్నారు. పంపిణీలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసేందుకు డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థను ఉపయోగించారు. 1.12 లక్షల మందికి పైగా ఉపాధ్యాయులకు 5 రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. 1 నుండి 5 తరగతులకు ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) , 6 నుంచి 9 తరగతులకు లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్ లను అమలు చేయనున్నారు. 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు ఏఐ పాఠ్యాంశాలు ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇచ్చారు. నందన్ నీలేకని సహ-స్థాపకుడు అయిన ఏక్‌స్టెప్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యంతో ఏఐ ద్వారా ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ మెరుగుపరచడానికి 5,651 ప్రాథమిక పాఠశాలల్లో అమలు చేయనున్నారు.

సిబ్బందికి శిక్షణ:

కేజీబీవీలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ పాఠశాలల్లో 51,500 మంది వంటవారికి పోషకాహారం, పరిశుభ్రతపై, అలాగే 48,292 మంది పారిశుధ్య కార్మికులకు పరిశుభ్రత పద్ధతులపై శిక్షణ ఇచ్చారు. సమ్మిళిత విద్యలో భాగంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం 602 భావిత కేంద్రాల్లో మౌలిక సదుపాయాల పెంపుదలకు రూ. 14.32 కోట్లు కేటాయించారు. కేజీబీవీల ఉన్నతీకరణ ద్వారా 120 కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలను 6-12 తరగతులకు ఉన్నతీకరించారు. తద్వారా 7,680 అదనపు సీట్లు అందుబాటులోకి వచ్చాయి. పోటీ పరీక్షల సన్నద్ధమయ్యే విద్యార్థులకోసం నీట్, ఎప్ సెట్ వంటి పోటీ పరీక్షలకు కోచింగ్ ఇవ్వనున్నారు. ప్రొ. జయశంకర్ బడి బాట ప్రచారం మే 2025 నుంచే ప్రారంభమైంది. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, మోడల్ పాఠశాలలు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ పాఠశాలల నుండి మొత్తం 48,292 మంది పారిశుధ్య కార్మికులకు శిక్షణ ఇచ్చారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌తో భాగస్వామ్యంతో ఈ శిక్షణ నిర్వహించారు. ఈ సంవత్సరం ప్రొ. జయశంకర్ బడి బాట (స్కూల్ ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్) మే 2025 నుంచే ప్రారంభించారు. సిబ్బంది కొరతను పరిష్కరించడానికి, ఉపాధ్యాయ సర్దుబాటు జిల్లాల్లో చేపట్టబడింది.

2025-26 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం:

దసరా సెలవులు : సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు

క్రిస్మస్ సెలవులు: డిసెంబర్ 23 నుంచి 27 వరకు

సంక్రాంతి 2026 సెలవులు: జనవరి 11 నుంచి 15 వరకు

వేసవి సెలవులు: ఈ ఏడాది కూడా ఏప్రిల్ 23 నుంచి జూన్ 12 వరకు

Next Story