- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్‌డెస్క్: భాగ్యనగర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిష్టాత్మకంగా నిలిచే ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాల ముందస్తు ఏర్పాట్లపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఇవాళ నగరంలోని పీజేఆర్ భవన్‌లో బోనాల ఉత్సవాల నిర్వహణ, భక్తుల సౌకర్యాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల అధికారిక తేదీలతో పాటు భక్తులకు కల్పించనున్న సౌకర్యాల వివరాలను మంత్రి వెల్లడించారు. జులై 16, గురువారం చారిత్రాత్మక గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయం వద్ద తొలి బోనంతో ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 2, ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రధాన ఉత్సవం జరగనుంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అదేవిధంగా ఆగస్టు 3న లష్కర్ బోనాల మరుసటి రోజున అత్యంత కీలకమైన భవిష్యవాణి వినే ‘రంగం’ కార్యక్రమం, అనంతరం అమ్మవారి ఘటాల ఊరేగింపు జరగనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
భక్తుల కోసం భారీ ఏర్పాట్లు..
బోనాల ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రవాణా, భద్రతా పరంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బోనాల ఉత్సవాలు జరిగే ఆలయాలకు చేరుకోవడానికి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఆర్టీసీ (TSRTC) బస్సుల సంఖ్యను భారీగా పెంచుతామని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈసారి పోలీస్ బందోబస్తును మరింత పెంచుతున్నట్లుగా మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా మహిళా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక పోలీస్ బృందాలను, షీ టీమ్స్‌ను రంగంలోకి దించుతామని పేర్కొన్నారు. ప్రధాన ఆలయాల పరిసరాల్లో సీసీటీవీ కెమెరాల నిఘా పెంచుతామని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముందస్తు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.






