- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Scam: రూ.5,400 కోట్ల స్కామ్.. ఫార్మసీ కౌన్సిల్ చైర్మన్ కుమార్ పటేల్ అవినీతి బాగోతం
కీలకమైన ఫార్మా చదువులను అందించే కాలేజీలకు అనుమతుల విషయంలో భారీ కుంభకోణం బయటపడింది.

దిశ, తెలంగాణ బ్యూరో: కీలకమైన ఫార్మా చదువులను అందించే కాలేజీలకు అనుమతుల విషయంలో భారీ కుంభకోణం బయటపడింది. 2023-24 మధ్యకాలంలో భారతదేశం అంతటా దాదాపు 870 ఫార్మసీ కళాశాలలు కేవలం 13 రోజుల్లోనే ఎలా అనుమతులు పొందాయనే విషయంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. లోతుకి వెళ్తున్నా కొద్దీ పలు అక్రమాలు బయటపడుతుండటంతో రూ.5,400 కోట్ల స్కామ్‌కు కేంద్ర బిందువుగా ఉన్న కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ మోంటు కుమార్ పటేల్‌ని అరెస్ట్ చేసే పనిలో పడింది. అయితే పటేల్ దేశం విడిచి కెనడా పారిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుకున్న సీబీఐ అన్ని ఎయిర్ పోర్ట్‌లకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
రూ.కోట్లల్లో ముడుపులు
నిజానికి ఇతర వైద్య కళాశాలల్లాగే ఫార్మసీ కాలేజీల అనుమతుల విధానం కఠినంగా ఉంటుంది. గ్రౌండ్ లెవల్‌లో అసలు అన్ని సౌకర్యాలను కాలేజీ కల్పించిందా? లేదా? అనే విషయం పూర్తిగా భౌతిక తనిఖీల తర్వాతే నిర్ధారించాలి. కానీ చాలా వరకు కాలేజీలకు కేవలం జూమ్ కాల్స్ ద్వారా పరిశీలించి పర్మిషన్స్ ఇచ్చినట్టు.. అది కూడా 7 నుంచి 8 నిమిషాల వ్యవధిలోనే ఒక్కో జూమ్ కాల్ ద్వారా ఒక్కో కాలేజీకి పర్మిషన్ ఇచ్చారని సీబీఐ అధికారులు గుర్తించారు. చైర్మన్ వ్యవహార శైలిపై పలు ఫిర్యాదులు అందుకున్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నిఘా పెట్టగా అక్రమాలు నిజమేనని తెలియడంతో ఉన్నతాధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ జరిగినట్లు తెలుస్తోంది. మొదట కొత్త కాలేజీలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సర్క్యులర్ జారీ చేశారని, ఆ తర్వాత ఓ జూమ్ కాల్ పెట్టి ఎక్కడికక్కడ కాలేజీలకు అనుమతులు ఇచ్చారని గుర్తించింది.
సీబీఐ దర్యాప్తులో సంచలన అంశాలు
సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రం ప్రకారం కనీసం భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలు, సిబ్బంది.. చివరికి విద్యార్థులు కూడా లేరని భావిస్తున్న అనేక కళాశాలలకు ఫార్మా కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ పటేల్, అతని సహాయకులు అనుమతులిచ్చేశారు. అసలు తనిఖీలు కానీ, దానికి సమర్పించిన వీడియో ఆధారాలు, సంబంధిత పత్రాలు కానీ ఏవీ లేవు. దర్యాప్తులో అప్పటికే నెగిటివ్ రిమార్క్ ఉన్న కనీసం ఆరు కాలేజీలకు ఆమోదం లభించిందని తేలింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్‌లోని 23 కళాశాలలను సీబీఐ బృందాలు విచారించి ఈ విషయాన్ని ధ్రువీకరించుకున్నాయి.
కేసుల నమోదుతో ఊపందుకున్న దర్యాప్తు
జూన్ 30న సీబీఐ డాక్టర్ మోంటు కుమార్ పటేల్, ఇతరులపై ఐపీసీ సెక్షన్లు 120-బి(నేరపూరిత కుట్ర), 420(మోసం) అవినీతి నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కుమార్ పటేల్ పీసీఐ అధ్యక్ష ఎన్నికల్లో గెలవడానికి గానూ.. వచ్చిన ఓటర్లకు ఆతిథ్యం ఇవ్వడానికి న్యూఢిల్లీలోని ఒక హోటల్‌లో రూ.2.7 లక్షల విలువైన గదులను బుక్ చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. గెలిచిన తర్వాత, కీలకమైన కౌన్సిల్ పదవులకు సహాయకులను నియమించడం ద్వారా తనకు సంబంధించిన వ్యక్తులను ఎంచుకోవడానికి, తద్వారా విస్తృత అధికారాలను చేతిలో ఉంచుకొని, అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారని సీబీఐ దర్యాప్తు పత్రం తెలిపింది. చివరకు అవినీతి మరకలతో రూ.5,400 కోట్ల భారీ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా చట్టం ముందు నిలబడే పరిస్థితి తెచ్చుకున్నాడనే చర్చ జరుగుతోంది.






