తెలంగాణలో సెటైరికల్ పార్టీ.. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా సోషల్ మీడియాలో పోస్టు వైరల్

by Prasad Jukanti |   (  Updated:2026-07-25 08:47:52  IST  )

సీజేపీ తరహాలోనే తెలంగాణలోనూ సెటైరికల్ పాలిటిక్స్ షురూ అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి ఎండ్రిన్ వ్యాఖ్యలపై 'తెలంగాణ ఎండ్రిన్ పార్టీ' పేరిట నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

తెలంగాణలో సెటైరికల్ పార్టీ..  సీఎం వ్యాఖ్యలకు నిరసనగా సోషల్ మీడియాలో పోస్టు వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జాతీయ రాజకీయాల్లో కాక్రోచ్ జనతా పార్టీ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో సెటైరికల్ రూపంలో పురుడుపోసుకున్న సీజేపీ గంటల వ్యవధిలోనే సెన్సేషన్ గా మారి ఇప్పుడు ఏకంగా దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తోంది. సీజేపీ ఆందోళనలతో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆ పార్టీ ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది. దేశ రాజకీయాల్లో కొత్త తరం రాజకీయాలకు శ్రీకారంగా సీజేపీ పార్టీ నిలిచిన వేళ తెలంగాణ యువత సైతం ఈ నయా ట్రెండ్ పాలిటిక్స్ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా సోషల్ మీడియా వేదికగా సరికొత్త పార్టీ పేరు పుట్టుకురావడం హాట్ టాపిక్‍గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఓ వ్యాఖ్యలు వ్యంగ్యంగా ఓ నెటిజన్ చేసిన పోస్టు ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది.

తెలంగాణ ఎండ్రిన్ పార్టీ:

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ విషయంలో అధికార, విపక్షాల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం వాడీవేడీగా సాగుతోంది. తమ ప్రభుత్వం వచ్చాక 70 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని అధికార కాంగ్రెస్ చెబుతుంటే ఆ లెక్కలు నిజమని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటామని ప్రతిపక్ష నేతలు సవాళ్లు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసు ఉద్యోగాల సంఖ్యను పెంచాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళనకారులను ఎండ్రిన్ తాగి చావమంటున్నారని నిరుద్యోగులు, ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఉద్యోగాలు అడిగితే ఎండ్రిన్ తాగమంటావా? అంటూ సీఎంపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఏబీవీపీ నేత జాన్సీ ఎక్స్ వేదికగా చేసిన సెటైరికల్ పోస్టు ఆసక్తిగా మారింది. తెలంగాణ ఎండ్రిన్ పార్టీ అంటూ ఆమె ఓ పోస్టు చేశారు. పార్టీ పేరుతో పాటు పార్టీ జెండాను సైతం ఆమె పోస్టు చేస్తూ ఈ పార్టీకి వ్యవస్థాపకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ సెటైర్ వేశారు.

సెటైరికల్ వరకేనా అంతకు మించినా?:

ప్రస్తుతం దేశంలో రాజకీయ ధోరణులు మారుతున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్న వ్యాఖ్యకు నిరసనగా వ్యగ్యంగా పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తోంది. ఆ పార్టీ నేతృత్వంలో యువత చేపట్టిన ఆందోళన చిలికి చిలికి గాలివానలా మారడంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ సైతం స్పందించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ సెటైరికల్ పార్టీ పేరు అనౌన్స్ చేయడం ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. నిజానికి సీఎం చేసిన ఎండ్రిన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఈ మాటలు ప్రతిపక్షాలు తమకు ఆయుధంగా మలుచుకుంటున్నాయి. ఇటువంటి పరిస్థితులో తెలంగాణ ఎండ్రిన్ పార్టీ సోషల్ మీడియా వరకే పరిమితం అవుతుందా లేక సీజేపీ తరహాలో ఏదైనా కీలక ముందడుగు పడనుందా అనేది వేచి చూడాలి.




Next Story