శాంతి భద్రతల పరిరక్షణకు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం

by Ratna Kumari |

జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో పట్టణంలోని రాజీవ్‌నగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

శాంతి భద్రతల పరిరక్షణకు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఆదేశాల మేరకు శుక్రవారం సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో పట్టణంలోని రాజీవ్‌నగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 60 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత యజమానులు అవసరమైన పత్రాలు సమర్పించి వాహనాలను తీసుకెళ్లాలని సూచించారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి 3 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నేరాల నియంత్రణలో భాగంగా అనుమానిత వ్యక్తులను తనిఖీ చేసిన పోలీసులు వారి నివాసం, ఉపాధి, కదలికలకు సంబంధించిన వివరాలను సేకరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగేంద్రచారి మాట్లాడుతూ.. ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతాల్లోకి కొత్తగా వచ్చే వ్యక్తులు లేదా నేరస్తులు ఆశ్రయం పొందుతున్నారా అనే అంశాలను గుర్తించడంలో ఈ కార్యక్రమం దోహదపడుతుందని చెప్పారు.

ప్రతి కాలనీలో స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఈ విషయంలో పోలీసు శాఖ పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యువత గంజాయి, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లలను చదువుపై దృష్టి సారించేలా ప్రోత్సహించాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, సరఫరాకు సంబంధించిన సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐలు నాగరాజు, గణేష్, రంజిత్, ఆర్‌ఎస్‌ఐ శ్రీనివాస్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story