రావి కుంట రాబందుల వశం.. రూ.6 కోట్ల విలువైన భూమి కబ్జా!

by Jakkula.Mamatha |

ప్రభుత్వ భూమి లేదా ప్రైవేటు భూమి.. చెరువులు కుంటలు ఏదైనా సరే ఖాళీగా కనిపిస్తే చాలు గద్దల్లా వాలిపోయి పాగా వేయడమే కొంత మంది పనిగా పెట్టుకున్నారు.

రావి కుంట రాబందుల వశం.. రూ.6 కోట్ల విలువైన భూమి కబ్జా!
X

దిశ, నల్లగొండ బ్యూరో: ప్రభుత్వ భూమి లేదా ప్రైవేటు భూమి.. చెరువులు కుంటలు ఏదైనా సరే ఖాళీగా కనిపిస్తే చాలు గద్దల్లా వాలిపోయి పాగా వేయడమే కొంత మంది పనిగా పెట్టుకున్నారు. సామాన్యులు గజం భూమి నివాసం కోసం అక్రమించిన పాలకులు, అధికారులు వెంటనే పేదవాడి పై దాడి చేసి మరి ఖాళీ చేయిస్తారు. కానీ భూ స్వాములు, ఆర్థికంగా బలవంతులు, రాజకీయ పలుకుబడి కలిగిన వాళ్ళు ఏది అక్రమించిన పట్టించుకోరు. అందులో భాగంగానే మండలం పరిధిలో ఓ గ్రామంలో ఎన్నో ఎకరాలకు సాగు నీరు, గ్రామానికి సాగునీరు అందించిన కుంటను ఓ బడా భూ స్వామి ఆక్రమించారని పాలకులకు, ప్రభుత్వ అధికారులకు తెలిసి కూడా నోరు మెదపడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రావి కుంట ఎక్కడంటే..

నల్లగొండ కార్పొరేషన్ కు కూత వేటు దూరంలో మేళ్ల దుప్పలపల్లి గ్రామ పరిధిలోని కొన్ని దశాబ్దాలుగా రాగి కుంట అనే పేరు చెరువును తలపించేలా ఉండేది. ఆ కుంట 46 సర్వే నెంబర్ లో 3.02 ఎకరాలు, 47 సర్వే నెంబర్ లో 2.36 ఎకరాలు విస్తీర్ణం కలిగి ఉండేది. మొత్తం 5.38 ఎకరాల భూమి ఉండేది. ఈ భూమి పూర్తిగా ఇరిగేషన్ కు సంబంధించిన శిఖం భూమి. ఈ కుంటలో ఉన్న నీటితో గ్రామంలో ఉన్న వ్యవసాయ భూముల్లో భూగర్భజలం పెరిగేది. పంటల సాగుకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. అంతేగాకుండా ఎంత కరువు వచ్చిన తాగునీటికి కూడ సమస్య రాకుండా ఉండేది. అయితే గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్య కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ఉచిత చేపల పంపిణి సమయంలో కూడా ఈ కుంటలో చేప పిల్లలను వదిలిన విషయాన్ని స్వయంగా మత్స్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మేళ్ల దుప్పలపల్లి గ్రామానికి వెళ్లే దారిలో ప్రధాన రహదారికి పక్కనే ఉంది.

కబ్జాలో రూ.7 కోట్ల పైగా విలువైన భూమి..

గత కొంత కాలంగా విపరీతంగా భూముల విలువలు పెరిగిన తర్వాత పెద్దొల్ల కళ్లన్ని విలువైన భూములపైనే పడ్డాయి. అందులో భాగంగానే మేళ్ల దుప్పలపల్లి సర్వే నెంబర్ 46, 47లో ఉన్న సుమారు 5.38 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు ఆ భూమి విలువ ప్రస్తుతం ఒక్క ఎకరానికి రూ. 1 కోటి నుంచి రూ. 1.20 కోట్ల వరకు ధర పలుకుతోంది.అంటే సుమారు రూ.7కోట్లకు పైనే ఆ భూమి ధర పలుకుతుంది. అలాంటి భూమిని గద్దల్లా వాలిపోయి భూమి స్వామి అక్రమంగా కబ్జా చేసినట్లు తెలుస్తుంది. కుంటను సుమారు వంద మీటర్ల లోతు వరకు మట్టిని తోడేశారు. అక్కడ తీసిన ఎర్రమట్టిని రావి కుంట చుట్టూ పోసి సాగుకు అనుకూలమైన నేలగా మార్చారని తెలిసింది.

ఇప్పుడు ఒక 20 గుంటల వరకు కుంట మాదిరిగా ఉంచి దాని చుట్టూ వాణిజ్య పంటను సాగు చేస్తున్నట్లు సమాచారం. అక్కడ ఉన్న విషయం కుంట కొత్త వాళ్లకు ఎవరికి తెలియకుండా చుట్టూ పంటను సాగు చేస్తున్నారు. సుమారు మూడేళ్ల క్రితమే కుంట ఆక్రమణ జరుగుతుంటే గ్రామస్తులు కొంత ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేస్తే అలా వచ్చి ఇలా చూసి పోయారు. ఇదేంటని అధికారులను నిలదీస్తే కుంట అక్రమిత దారుడికి పెద్దోళ్ల అండ ఉంది... మేమేమి చేయలేనంటూ చేతులు ముడుచుకుని వెళ్లిపోయినట్లు సమాచారం. అక్రమణదారుడికి గత ప్రభుత్వంలోనూ.. ప్రస్తుత ప్రభుత్వంలోని పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకే గత పాలకులు అడ్డుకోలేదు.. ఇప్పటి పాలకులు అక్రమంగా కబ్జా జరిగిందని తెలిసినా కన్నెత్తి చూడలేదు.

విచారణ చేసి చర్యలు తీసుకుంటాం:కేశవ్ డీఈ ఇరిగేషన్, నల్లగొండ

రావి కుంట కబ్జాకు గురైన విషయం మాకు తెలియదు. మా అధికారిని పంపించి పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తాం. తమ పరిధిలో ఉన్న ఇరిగేషన్ భూముల రక్షణకు చర్యలు చేపడతాం అన్నారు.

Next Story