- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మే 21 నుంచి సరస్వతీ అంత్య పుష్కరాలు.. పోస్టర్ రిలీజ్
మే 21 నుంచి జూన్ 1 వరకు కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు జరగనున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సరస్వతీ అంత్య పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖా మంత్రి శ్రీమతి కొండా సురేఖ తెలిపారు. ఈరోజు సచివాలయంలోని మంత్రి ఛాంబర్‍లో ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబుతో కలసి సరస్వతి అంత్య పుష్కరాల పోస్టర్, అధికారిక టీజర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ ఈ సరస్వతీ అంత్య పుష్కరాలను మే 21 నుంచి జూన్ 1 వరకు, 12 రోజుల పాటు కాళేశ్వరంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పుష్కరాలకు 30.63 కోట్లతో 162 అభివృద్ధి పనులను చేపట్టామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు.
సమన్వయంతో పని చేయాలి:
ప్రశాంత వాతావరణంలో భక్తులు పుష్కర స్నానం, స్వామి దర్శనం చేసుకొనే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అన్ని శాఖల సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ అంత్య పుష్కరాలకు 30 లక్షల భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సరస్వతి ఆది పుష్కరాలు (మే 15, 2025 నుండి మే 26, 2025), సమ్మక సారలమ్మ జాతర నిర్వహణకు అవకాశం వచ్చిందని, వాటిని అత్యంత ఘనంగా నిర్వహించామన్నారు. ఇప్పుడు సరస్వతి అంత్య పుష్కరాలు, వచ్చే సంవత్సరం రానున్న గోదావరి పుష్కరాలకు కూడా పనులను ప్రారంభించామని తెలిపారు.
10 రోజుల ముందే పనులు పూర్తి కావాలి:
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి డి.శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సరస్వతీ పుష్కరాలలో భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. 10 రోజుల ముందే పుష్కరాల పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య కలగకుండా పోలీసు యంత్రాంగం, ఇతర శాఖలు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. కాళేశ్వరం దేవస్థానం పునర్నిర్మాణానికి రూ. 198 కోట్లను కేటాయించినందుకు సీఎం శ్రీ రేవంత్ రెడ్డికి మంత్రి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, కాళేశ్వర ఆలయ ట్రస్ట్ చైర్మన్ మోహన్ శర్మ, దేవాదాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.






