Sankranthi Vibe: పల్లెల్లో సంక్రాంతి పండుగ జోరు..! ‘సర్పంచ్’ ఆశావహుల హడావుడి

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్స్ కోసం ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఎన్నికల బరిలో నిలబడాలని భావిస్తున్న వారు గ్రామంలో హడావుడి మొదలు పెట్టారు.

Sankranthi Vibe: పల్లెల్లో సంక్రాంతి పండుగ జోరు..! ‘సర్పంచ్’ ఆశావహుల హడావుడి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్స్ కోసం ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఎన్నికల బరిలో నిలబడాలని భావిస్తున్న వారు గ్రామంలో హడావుడి మొదలు పెట్టారు. గ్రామస్తులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు షురూ చేశారు. సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో పిల్లలకు క్రికెట్ పోటీలు, మహిళలకు ముగ్గుల కాంపిటీషన్లు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. గెలుపొందిన వారికి ఖరీదైన బహుమతులు ప్రదానం చేసేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతున్నది. కొన్ని చోట్ల కొందరు లీడర్లు స్మార్ట్ ఫోన్లు సైతం ఇచ్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం. మరికొన్ని గ్రామాల్లో నెలన్నర క్రితమే యువకులకు లీడర్లు క్రికెట్ కిట్స్ పంపిణీ చేశారని, వారికి పండుగ సందర్భంగా టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నట్లు టాక్ ఉంది.

కొద్ది రోజులుగా హడావుడి

ఈసారి లోకల్ బాడీ ఎన్నికలకు ముందు సంక్రాంతి పండుగ రావడంతో ఆ ప్రభావం ఊర్లల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. పోటీకి సిద్ధమవుతున్న లీడర్లు.. గ్రామస్తులకు మరింత దగ్గరయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. గ్రామంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా లీడర్లు, వారి అనుచరులు ప్రత్యక్షమవుతున్నారు. పెండ్లిలు, పేరంటాలు, చావులకు సైతం హాజరై తమ వంతుగా ఆర్థిక సాయం చేస్తున్నారు. కార్యక్రమం పూర్తయ్యే వరకు అక్కడే ఉండి అందరినీ పేరు పేరునా పలకరిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తమ సత్తా చాటేందుకు పోటీ పడుతూ మరి ఖర్చు పెడుతున్నారనే చర్చ జరుగుతున్నది. వార్డుల వారీగా యువకులకు దావత్‌లు ఇచ్చేందుకు సైతం రెడీ అవుతున్నారని టాక్.

ఇంటింటికీ మందు, మాంసం

సంక్రాంతి రోజున ఇంటింటికీ తమ తరుపున చికెన్, మటన్, మందు పంపిణీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు టాక్. అందుకోసం పెద్ద ఎత్తున లిక్కర్, గొర్లు, మేకలు, కోళ్లు ఇప్పటికే కొనుగోలు చేసినట్టు స్థానిక వ్యాపారుల మధ్య డిస్కషన్ జరుగుతున్నది. కొన్ని గ్రామాల్లో ప్రత్యర్థి పంపిణీ చేసే మందు బ్రాండ్‌ను ముందే తెలుసుకుని, అంతకన్నా ఖరీదైన మద్యాన్ని పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు టాక్.

కాంగ్రెస్ నుంచే ఎక్కువ పోటీ

ఈ సారి ఎలాగైనా సర్పంచ్ సీట్‌లో కూర్చోవాలనే లక్ష్యంగా పెట్టుకున్న లీడర్లు.. స్థానికంగా జరిగే కార్యక్రమాలకు పోటీ పడుతూ హాజరవుతున్నారు. కాంగ్రెస్ తరఫున పోటీకి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఖర్చు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఒక లీడర్ గ్రామంలోని యూత్‌కు దావత్ ఇచ్చినట్లు తెలియగానే, మరో లీడర్ అందుకు పోటీగా మరో రోజు పార్టీకి ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు సైతం కొన్ని గ్రామాల్లో పోటీ నెలకొన్నది.

యువత ఆసక్తి

సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రామాల్లో ఎక్కువ మంది యువకులు ఆసక్తి చూపుతున్నారు. రాజకీయాల్లో ఎంట్రీకి సర్పంచ్ పదవి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. జనరల్ సీటు అయితే తానే నిల్చునేలా.. ఉమెన్ రిజర్వేషన్ అయితే తన భార్య లేదా తల్లితో పోటీ చేయించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. మొన్నటి వరకు సర్పంచులుగా పని చేసిన లీడర్లు బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారని, ఆ పదవి జోలికి వెళ్లొద్దని ఇంట్లోని వారు వారించే ప్రయత్నం చేస్తుంటే.. ప్రస్తుత ప్రభుత్వంలో అలాంటి ఇబ్బందులు తలెత్తవన్న ధీమాను ఆశావహులు వ్యక్తం చేస్తున్నారు.

రిజర్వేషన్ మారితే?

ఇప్పటివరకు రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదు. దీంతో సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతున్న యువత మరో ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. రిజర్వేషన్ తమకు అనుకూలంగా వస్తే ఓకే అని.. లేదంటే తమ స్నేహితులను బరిలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు పెట్టిన ఖర్చును పోటీ చేసే అభ్యర్థుల నుంచి రాబట్టే ప్లాన్‌లో ఉన్నట్టు టాక్.

వచ్చే నెలలో షెడ్యూల్?

వచ్చేనెల రెండు లేదా మూడో వారంలో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే చాన్స్ ఉన్నది. ఎన్నికల ప్రక్రియ మొత్తం 20 రోజుల్లో పూర్తయ్యేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలతో పాటే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలా? లేదంటే విడివిడిగా నిర్వహించాలా? అనే విషయంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నది. సర్కారు నుంచి సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టు అందగానే, బీసీల రిజర్వేషన్లను డెడికేషన్ కమిషన్ ఫైనల్ చేయనుంది. ఆ ప్రక్రియ పూర్తయిన రెండు, మూడు రోజులకే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు స్టేట్ ఎన్నికల సంఘం సిద్ధమైనట్టు టాక్.

Next Story