మహిళల కోసం దేశంలోనే తొలిసారిగా ఓ కొత్త ఏర్పాటు

by Muthe.Rajitha |

మహిళా ప్రయాణికుల సౌలభ్యం కోసం తెలంగాణ ఆర్టీసీ బస్టాండ్ లు, డిపోల్లో వెండింగ్ మిషన్ల ద్వారా సానిటరీ నాప్​కిన్​లను అందుబాటులో ఉంచనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు.

మహిళల కోసం దేశంలోనే తొలిసారిగా ఓ కొత్త ఏర్పాటు
X

దిశ, తెలంగాణ బ్యూరో : మహిళా ప్రయాణికుల సౌలభ్యం కోసం తెలంగాణ ఆర్టీసీ బస్టాండ్ లు, డిపోల్లో వెండింగ్ మిషన్ల ద్వారా సానిటరీ నాప్​కిన్​లను అందుబాటులో ఉంచనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. బస్సు ప్రయాణం చేస్తున్న సమయంలో మహిళలకు అత్యవసరంగా సానిటరీ నాప్​కిన్​ల అవసరం ఏర్పడే అవకాశం వస్తుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారం తీసుకుని సహేలీ అనే సంస్థ ద్వారా బస్టాండ్​లలో ఏర్పాటు చేయిస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ , రవాణా శాఖల సహకారంతో పైలెట్ ప్రాజెక్టుగా ములుగు, హనుమకొండ బస్టాండ్ లలో మరో పది రోజుల్లో ఏర్పాటు చేయించనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఆ తర్వాత దశల వారీగా హుస్నాబాద్, హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్టాండ్లు, డిపోలకు విస్తరింపజేయిస్తామన్నారు.

శుక్రవారం హైదరాబాద్​ప్రజా భవన్​లో ఈ మేరకు సహేలి సంస్థ తెలంగాణ ఆర్టీసీతో ఒప్పందం కుదుర్చుకోగా, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ల సమక్షంలో మంత్రి సీతక్క సహేలీ పోస్టర్​ను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ సహేలీ అనే సంస్థ మహిళల ఆరోగ్య విషయంలో పనిచేయడానికి ముందుకు వచ్చిందన్నారు. నెలసరితో మహిళ ప్రయాణికులు ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో ప్రయోగాత్మకంగా ములుగు , హనుమకొండలో బస్టాండ్లలో ఏర్పాటు చేయిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు ముందుకొచ్చిన సహేలి సంస్థ వ్యవస్థాపకురాలు కొమ్ము అనుపమను మంత్రి సీతక్క అభినందించారు.

Next Story