- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇసుక బజార్లపై ‘సాండ్ మాఫియా’ కుట్రలు.. నాణ్యత లేనిదంటూ దుష్ప్రచారం
నగరానికి నాలుగు వైపులా మైనింగ్ శాఖ ఏర్పాటు చేసిన ఇసుక బజార్లు నడవకుండా సాండ్ మాఫియా కుట్రలు చేస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: నగరానికి నాలుగు వైపులా మైనింగ్ శాఖ ఏర్పాటు చేసిన ఇసుక బజార్లు నడవకుండా సాండ్ మాఫియా కుట్రలు చేస్తున్నది. కొందరు అనుచరులను పరిసరాల్లో ఉంచి.. కొనుగోలు చేయడానికి వచ్చే వారిని పక్కదారి పట్టిస్తున్నది. ఇసుక నాణ్యత లేదని, ఇండ్ల నిర్మాణానికి ఏమాత్రం పనికిరాదని మాయమాటలు చెబుతున్నది. ఒక్కసారి కొనుగోలు చేశాక మళ్లీ రిటర్న్ ఇవ్వలేమని భయపెడుతున్నది. తమ వద్ద నాణ్యమైన ఇసుక ఉందని, ప్రభుత్వ ధర కంటే తక్కువకే సరఫరా చేస్తామని నమ్మబలుకుతున్నది. వీరి మాటలు నమ్ముతున్న కొందరు ఇండ్ల నిర్మాణదారులు బజార్లలో ఇసుక కొనుగోలు చేయకుండా వెనుదిరుగుతున్నారు. దీంతో ఇసుక బజార్లు వెలవెలబోతున్నాయి.
నేరుగా సైతం వెళ్లి..
ఇసుక కోసం తిరిగే వారి అడ్రస్ లు సేకరిస్తున్న సాండ్ మాఫియా.. వారి కట్టడాల దగ్గరకు సైతం వెళ్తున్నది. ఐదు నుంచి వంద టన్నుల వరకు గంటలో సరఫరా చేస్తామని చెప్పి వారు ఇసుక బజార్ల వైపు వెళ్లకుండా చేస్తున్నది. ఇసుక బజార్లను ఇప్పుడే దెబ్బతిస్తే.. ప్రభుత్వం వాటిని ఎత్తివేస్తుందని, ఆతర్వాత తాము ఇష్టాను సారంగా ధరలు పెంచుకోవచ్చని ఇసుక మాఫియా భావిస్తున్నట్లు తెలిసింది.
అమ్మకాలు అంతంతే..
తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ గ్రేటర్ నగర ప్రజల కోసం వట్టినాగులపల్లి, అబ్దుల్లాపూర్ మెట్, బోరంపేట, ఆదిభట్ల బజార్లు ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేక సిబ్బందిని నియమించింది. అయితే అక్కడ రోజుకు 15 నుంచి 20 లారీలు కూడా అమ్ముడు పోవడం లేనట్టు తెలిసింది. చాలా మంది నిర్మాణదారులు ఇసుక బజార్లకు వస్తే .. ప్రభుత్వం ఏది సరఫరా చేసినా నాణ్యత ఉండదని, నష్టపోతారని అబద్దాలు చెబుతూ అక్కడి రాకుండా దుష్ప్రచారం చేస్తున్నారని మైనింగ్ శాఖ సిబ్బంది తెలిపారు.
ధర తక్కువని తూకంలో మోసాలు!
నిర్మాణదారులు ఒకసారి టచ్ అయితే సాండ్ మాఫియా వారిని వదిలిపెట్టడం లేదు. మార్కెట్ కంటే తక్కువ ధరకు సప్లయి చేస్తామని ఒప్పందాలు చేసుకుంటున్నారు. అయితే ధర్మకాంటపై తూకం వేసేటప్పడు మాత్రం మోసం చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. 35 టన్నుల లారీని తూకం వేసి 4 టన్నులు అదనంగా చూపిస్తున్నారని, 50 టన్నుల లారీని తూకం వేస్తే 57 టన్నులు వచ్చినట్లు వే బిల్లు తీసుకుంటున్నారనే చర్చ జరుగుతున్నది. లేని ఒక టన్ను ఇసుకకు బిల్లు ఇస్తే వేబ్రిడ్జి యాజమాన్యాలు కూడా అక్రమ సంపాదనకు అలవాటుపడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఇసుక బజార్లు లేకుండా ఎత్తుగడలు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇసుక మాఫియాకు ముకుతాడు వేసింది. ఇష్టానుసారంగా అమ్మకాలు చేయకుండా, లారీల్లో అదనపు లోడు వేయకుండా కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. దీంతో ఇసుక మాఫియా అక్రమ సంపాదనకు బ్రేక్ పడింది. ఇప్పుడు పెద్దపెద్ద నిర్మాణదారులకే ఇసుక సరఫరా చేయాల్సి వస్తున్నది. పెద్ద బిల్డర్లు 15 నుంచి 20 లారీలు ఇసుక సరఫరా చేసిన తరువాత.. ఒకేసారి డబ్బులు ఇస్తారు. ఇసుక అమ్మేవారు అప్పటివరకు లారీ యాజమాన్యాలకు నగదు చెల్లించి ఇసుక తీసుకుంటారు. అయితే సొంతంగా ఇండ్లు నిర్మించే వారికి సరఫరా చేస్తే వారికి లాభం ఎక్కువగా ఉంటుంది. ఒక లారీ సరఫరా చేస్తే టన్నుకు రూ. 300 చొప్పన లాభం చూసుకోవడమే కాకుండా.. రెండు, మూడు టన్నులు బిల్లులో అదనంగా దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు సొంతంగా ఇండ్లు కట్టుకునే వారు నేరుగా బజార్ల వద్ద ఇసుక కొనుగోలు చేసేందుకు వస్తే.. తమకు నెలకు లక్షల్లో వచ్చే ఆదాయానికి గండిపడుతుందని ఇసుక మాఫియా భయపడుతున్నది. అందుకే దుష్ప్రచారం చేస్తూ ఇసుక బజార్లు లేకుండా ఎత్తుగడలు వేస్తున్నది.






