ట్రాన్స్‌ప్లాంట్‌ హబ్‌గా సనత్‌నగర్ టిమ్స్‌ : మంత్రి దామోదర్ రాజనర్సింహ

by Naga Rani Yarlagadda |

అన్ని రకాల అవయవ మార్పిడి శస్త్రచికిత్సలకు నిలయంగా సనత్‌నగర్‌‌ టిమ్స్‌ను తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.

ట్రాన్స్‌ప్లాంట్‌ హబ్‌గా సనత్‌నగర్ టిమ్స్‌ : మంత్రి దామోదర్ రాజనర్సింహ
X
  • దేశంలోనే అత్యాధునిక ప్రభుత్వ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌గా మార్పు

దిశ, తెలంగాణ బ్యూరో : అన్ని రకాల అవయవ మార్పిడి శస్త్రచికిత్సలకు నిలయంగా సనత్‌నగర్‌‌ టిమ్స్‌ను తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. నిమ్స్‌, ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్లకు చెందిన ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్లతో కలిసి మంత్రి సోమవారం ఉదయం సనత్‌నగర్‌‌లోని టిమ్స్‌ను సందర్శించారు. అక్కడ అత్యాధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూలు, ఇతర వైద్య సదుపాయాలను పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. సనత్‌నగర్ టిమ్స్‌ను 'ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ ఎక్సలెన్స్ సెంటర్‌‌'గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. నిమ్స్ మాదిరిగానే ఈ టిమ్స్‌ను కూడా స్వయంప్రతిపత్తి (అటానమస్) సంస్థగా నిర్వహిస్తామని, డాక్టర్లు, ఇతర సిబ్బంది నియామకాలు కూడా అదే విధానంలో ఉంటాయని స్పష్టం చేశారు. దేశంలోనే అత్యాధునిక ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌గా సనత్ నగర్ టిమ్స్ మార్చనున్నామని తెలిపారు.

నిమ్స్ ఒత్తిడికి బ్రేక్.. టిమ్స్‌లో సర్జరీలు..

నిమ్స్‌లో పరిమిత సంఖ్యలో ఉన్న ఆపరేషన్ థియేటర్ల కారణంగా న్యూరో, కిడ్నీ, గుండె మార్పిడి సర్జరీల కోసం రోగులు నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోందని సర్జన్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి.. నిమ్స్‌లో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న రోగులకు టిమ్స్‌లో శస్త్రచికిత్సలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. నిమ్స్ నుంచి వచ్చే వైద్య బృందాలు టిమ్స్‌లోని ఆపరేషన్ థియేటర్లను వినియోగించుకునేలా పరిపాలనా ఏర్పాట్లు చేయాలని డీఎంఈ డా. నరేంద్ర కుమార్‌ను ఆదేశించారు. టిమ్స్‌లో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు అవసరమైన అత్యాధునిక మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని, దశలవారీగా వివిధ అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను ప్రారంభించవచ్చని సర్జన్లు మంత్రికి వివరించారు. సేవల విస్తరణకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో డీఎంఈ డా. నరేంద్ర కుమార్, నిమ్స్ మాజీ డైరెక్టర్ డా. బీరప్ప, గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. వాణి, ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. రాకేశ్ సహయ్, జీవన్‌దాన్ ఇన్‌చార్జ్ డాక్టర్ భూషణ్ రాజ్‌తో పాటు నిమ్స్‌, గాంధీ, ఉస్మానియా తదితర ప్రభుత్వ హాస్పిటళ్లకు చెందిన ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్లు డా. మధుసూదన్, డా. మనీషా సహాయ్, డా. గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

Next Story