సనత్ నగర్ ‘టిమ్స్’ ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదరట్లే

by Malleboina Mahesh |

సనత్ నగర్ ‘టిమ్స్’ ఆసుపత్రి ప్రారంభోత్సవం మూడోసారి వాయిదా పడింది. ఆపరేషన్ థియేటర్ల పరికరాల కొనుగోళ్లలో జాప్యం వల్ల ఆవిర్భావ దినోత్సవాల ముహూర్తం కూడా తప్పేలా ఉంది.

సనత్ నగర్ ‘టిమ్స్’ ప్రారంభోత్సవానికి ముహూర్తం కుదరట్లే
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైద్య శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సనత్ నగర్ లోని తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(టిమ్స్‌)ప్రజలకు అందుబాటులోకి రావడం లేదు. దీంతో ప్రారంభోత్సవానికి నిర్ణయించిన ముహుర్తాలు వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో సనత్ నగర్, ఎల్బీనగర్, అల్వాల్ లో టిమ్స్ ఆస్పత్రులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. అందులో ముందుగా సనత్ నగర్ లో నిర్మించిన టిమ్స్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కావాల్సిన పనులు పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

గత ఏడాది డిసెంబర్ 9న ప్రారంభించాలని ముందుగా భావించారు. కానీ బిల్డింగ్ లో మార్పులు చేర్పులు చేయాలని వాయిదా వేశారు. ఆ తర్వాత ఉగాది పండుగ సందర్భంగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని భావించారు. అయితే ఆపరేషన్ థియేటర్ కు సంబంధించిన పరికరాలు ఇన్ స్టాల్ చేయడంలో ఆలస్యం కారణంగా మళ్లీ వాయిదా వేశారు. జూన్ 2 నుంచి 12వ తేదీ వరకు జరిగే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా ప్రారంభించాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పటికీ అక్కడ పనులు పూర్తికాలేదని స్పష్టమవుతున్నది.

ఓ సీనియర్ అధికారి వల్లే ఆలస్యం?

వైద్యశాఖలోని ఓ కీలక అధికారి తీరు వల్లే పనులు పూర్తి కావడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సదరు అధికారి ప్రతి విషయంలో కొర్రీలు పెట్టడంతో పనుల్లో జాప్యం జరుగుతున్నట్టు వైద్యశాఖ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆపరేషన్ థియేటర్లకు కావాల్సిన పరికరాల కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోంది. సదరు అధికారి ప్రత్యేక ఇంట్రెస్ట్ కారణంగానే పరికరాల కొనుగోళ్లలో ఆలస్యం జరిగినట్లు ప్రచారం ఉంది. అయితే ఆస్పత్రిని ప్రారంభించేందుకు ప్రభుత్వం చొరవ చూపినప్పుడు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను వివరించడంలో సదరు అధికారి విఫలమయ్యారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందుకే మూడు సార్లు నిర్ణయించిన ముహుర్తాలు వాయిదా పడినట్టు ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టిమ్స్ నిర్మాణంలో ఉన్న సాంకేతిక సమస్యలను సదరు కీలక అధికారి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో పట్టు పట్టినట్టుగా వ్యవహరించారనే అరోపణలు ఉన్నాయి.

రెండు శాఖల మధ్య వార్!

గత ప్రభుత్వం టిమ్స్ నిర్మాణ పనులను (సివిల్ వర్క్స్, వైద్య పరికరాల బిగింపు పనులు)ఆర్ అండ్ బీ శాఖకు అప్పగించింది. పనులు తుదిదశకు వస్తున్న సమయంలో వైద్యశాఖ వర్సెస్ ఆర్ అండ్ బీ శాఖ మధ్య వివాదం మొదలైంది. ఆపరేషన్ థియోటర్లకు అనుగుణంగా నిర్మాణ పనులు లేవంటూ వైద్యశాఖ అధికారులు అభ్యంతరం చెప్పారు. దీంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని వైద్యశాఖ సూచించిన మేరకు సివిల్ వర్క్స్ లో మార్పులు చేయాలని ఆర్ అండ్ బీ శాఖను ఆదేశించింది. తీరా పనులు పూర్తిచేసి బిల్డింగ్ ను వైద్య శాఖకు అప్పగించిన తర్వాత ఆపరేషన్ థియేటర్లలో కావాల్సిన పరికరాల కొనుగోళ్లు తమ పరిధిలో లేదని చేతులెత్తేశారు.

మళ్లీ సర్కారు జోక్యం చేసుకుని పరికరాల కొనుగోలు బాధ్యతల నుంచి ఆర్ అండ్ బీ శాఖను తప్పించి వైద్యశాఖకు అప్పగించింది. ప్రస్తుతం పరికరాల కోనుగోలు ప్రక్రియ కొనసాగుతున్నట్టు తెలిసింది. అయితే టిమ్స్ బిల్డింగ్ నిర్మాణంలో కేవలం ఆర్అండ్ బీ శాఖతో పాటు వైద్య శాఖ ప్రమేయం ఉండేలా నిబంధనలను సవరించాలనే అంశాన్ని ప్రభుత్వ పెద్దలకు చెప్పడంలో అధికారులు విఫలమైనట్లు తెలిసింది. ఇప్పటికైనా పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story