- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని 50 వేల మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి సైతం ప్రతినెలా మొదటి తారీఖునే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఐఏఎస్ అధికారులకు నెలనెలా సమయానికి జీతాలు అందినట్లే.. గ్రామ పంచాయతీ సిబ్బందికి సైతం ఇవ్వాలని స్పష్టం చేశారు. మంగళవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. సిబ్బంది జీతాలు చెల్లించడానికి ఇక నుంచి ప్రతినెలా రూ.50 కోట్లు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అనే తేడా లేకుండా అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలు అందేలా చూడాలన్నారు. సిబ్బంది జీతాలు ఒక్కరోజు ఆలస్యమైనా ఊరుకునేది లేదని హెచ్చరించారు. అలాగే, సొంత ఆదాయంపై గ్రామ పంచాయతీల స్వతంత్రతను నిర్వీర్యం చేస్తూ గత ప్రభుత్వం తొలగించిన నిబంధనను పునరుద్ధరించేందుకు సీఎం అంగీకారం తెలిపారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018 లోని సెక్షన్ 70(3) ప్రతిపాదిత సవరణ ప్రకారం.. గ్రామ పంచాయతీ సొంత ఆదాయాన్ని ట్రెజరీ ఖాతాలో కాకుండా బ్యాంకు ఖాతాలో జమచేసే విధంగా సవరణ చేయాలని ఆదేశించారు.
పెన్షన్ల పంపిణీ విధానంపైనా ఆయన కీలక ఆదేశాలిచ్చారు. పోస్టల్ శాఖ ద్వారా అందజేస్తున్న ప్రస్తుత విధానాన్ని మార్చి, నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించారు. అర్హులకే పెన్షన్లు అందేలా చూడాలన్నారు. ఓటర్ ఐడీ, ఆధార్ డేటా ఆధారంగా పెన్షన్ల పంపిణీని క్రమబద్ధీకరించాలని సూచించారు. అంతేకాకుండా, కొత్తగా అందించే పెన్షన్లలో ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.






