- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భూమి సునీల్ ఆధ్వర్యంలో సాగు న్యాయ యాత్ర
తెలంగాణలోని లక్ష మంది రైతులకు సాగు చట్టాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో భూమి సునీల్ సాగు న్యాయ యాత్రను చేపట్టారు.

దిశ, తెలంగాణ బ్యూరో : లక్ష మంది రైతులకు సాగు చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు రైతుల న్యాయ అవసరాలపై అధ్యయనం చేయడం కోసం లీఫ్స్ సంస్థ బృందం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేపట్టింది. ఆ సంస్థ వ్యవస్థాపకులు భూమి సునీల్ ఆధ్వర్యంలో ‘సాగు న్యాయ యాత్ర’ జూన్ 28న ప్రారంభమై అక్టోబర్ 2 వరకు కొనసాగింది. ఇప్పటికే 800 పైచిలుకు గ్రామాల మీదుగా 2400 కిలోమీటర్లలో 10 వేల మంది రైతులను కలిసిన భూమి సునీల్ రైతులకు సాగు చట్టాలపై అవగాహన కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి గ్రామాల మీదుగా దాదాపు మూడు వేల కిలోమీటర్లు పర్యటించనున్న ఈ బృందం రెండో విడతగా ఈ నెల 17 (సోమవారం) నుంచి ‘సాగు న్యాయ యాత్ర’ను ప్రారంభించనుంది. ఈ యాత్ర జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ నుంచి పాలకుర్తి, పెద్దవంగర, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, నాగారం, జాజిరెడ్డిగూడెం వరకు భూమి సునీల్ నేతృత్వంలో కొనసాగనుంది.
భూమి సునీల్ నేతృత్వంలోని లీఫ్స్ బృందం.. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ రైతులను నేరుగా కలిసి, వారికి కీలకమైన వ్యవసాయ చట్టాలను వివరిస్తుంది. భూమి, విత్తనం, సాగు నీరు, పంట రుణాలు, పంటల భీమా, వ్యవసాయ మార్కెట్లకు సంబంధించి అమలులో ఉన్న కీలక చట్టాలను వివరిస్తూ రూపొందించిన కరపత్రాన్ని రైతులకు అందజేస్తుంది. అవగాహన పొందిన ఈ 10వేలమంది మరో పది మంది రైతులకు ఈ విషయాలు తెలియజేసేలా ప్రయత్నం చేస్తుంది.
ఈ యాత్రలో భాగంగా రైతుల న్యాయ అవసరాలపై అధ్యయనం చేస్తూ రైతులకు మెరుగైన ఉచిత న్యాయ సేవలు అందించడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి అధ్యయనం చేయడం, రైతులకు సాగు చట్టాలపై అవగాహన కల్పించడం, ఈ రెండు వినూత్న ప్రయత్నాలు దేశంలోనే మొదటిసారి కావడం గమనార్హం. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, మారుతున్న సవాళ్లకు తగ్గట్టుగా సాగు సాఫీగా సాగడం కోసం ఎన్నో చట్టాలు వచ్చాయి. భూమి, వ్యవసాయానికి సంబంధించి ఇప్పుడు రాష్ట్రంలో రెండు వందలకు పైగా చట్టాలు అమలులో ఉన్నాయి.
లీఫ్స్ బృందం పర్యటించే రూటు వివరాలు..
స్టేషన్ ఘనపూర్ నుండి - గూడూరు - పాలకుర్తి - పెద్దవంగర - తుంగతూర్తి - నాగారం - జాజిరెడ్డిగూడెం వరకు (జనగాం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల పరిధిలో) కొనసాగుతుంది.






