రైతు కమిషన్ Vs వ్యవసాయ శాఖ.. రెండింటి మధ్య నో కో-ఆర్డినేషన్

by Kema Shiva Kumar |

రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కోసం కలిసి పని చేయాల్సిన వ్యవసాయ శాఖ, రైతు కమిషన్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటున్నది.

రైతు కమిషన్ Vs వ్యవసాయ శాఖ.. రెండింటి మధ్య నో కో-ఆర్డినేషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కోసం కలిసి పని చేయాల్సిన వ్యవసాయ శాఖ, రైతు కమిషన్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటున్నది. తాము చెప్పినట్లే పని చేయాలని వ్యవసాయ శాఖ భావిస్తుంటే, ఏం చేయాలో ఏం చేయకూడదో తమకు స్పష్టత ఉందని రైతు కమిషన్ వాదిస్తున్నట్లు తెలుస్తున్నది. దీనితో అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్, రైతు కమిషన్ మధ్య అంతరం రోజురోజుకూ పెరుగుతోందని జోరుగా చర్చ జరుగుతున్నది. తమకు అవసరమైన నిధులు, సిబ్బందిని కేటాయించకుండా వ్యవసాయ శాఖ ఇబ్బందులకు గురి చేస్తుందని కమిషన్ వర్గాలు చెబుతుండగా.. అడిగిన వెంటనే కాకుండా అవసరాల మేరకే స్టాఫ్‌ కేటాయిస్తామని వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి.

కమిషన్ అవసరమా అంటూ సెటైర్లు?

గతేడాది అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం రైతు కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డితో పాటు ఏడుగురు సభ్యులను నియమించింది. వీరంతా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ రైతులు ఎదుర్కోంటున్న సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలను కనుక్కుని ప్రభుత్వానికి సిఫారసు చేయాలి. అందుకోసం తమకు సిబ్బంది, నిధులు కేటాయించాలని కమిషన్ వ్యవసాయ శాఖకు లేఖ రాసింది. అంతే కాకుండా డిపార్ట్‌మెంట్‌లోని ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తులను కలిసి తమ అవసరాలను కమిషన్‌లోని కీలక సభ్యులు వివరించారు. ఈ క్రమంలోనే అసలు ‘కమిషన్ ఏర్పాటు అవసరమా? కొత్తగా కమిషన్ ఏం చేస్తది?’ అని వ్యవసాయ శాఖలోని కీలక వ్యక్తులు సెటైర్లు వేసినట్లు సమాచారం. దీనికి కమిషన్‌లోని కీలక వ్యక్తులు స్పందిస్తూ “కమిషన్ ఆశామాషీగా అపాయింట్ కాలేదని, ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిందని.. ఆ విషయాన్ని గుర్తించాలి’ అని ధీటుగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.

జీతాలు, స్టాఫ్ లేక అవస్థలు..

రైతు కమిషన్ చైర్మన్ ఏర్పాటు చేసి దాదాపు నాలుగు నెలలు అవుతున్నది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు సభ్యులకు జీతాలు అందలేదని టాక్. దీంతో కమిషన్ చైర్మన్‌తో పాటు మెంబర్లు సైతం సొంత ఖర్చులతోనే జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నిధులు ఇవ్వాలని ప్రభుత్వంలోని కీలక నేతల దృష్టికి పలు సార్లు తీసుకెళ్లగా ఈ మధ్యే రూ.5 కోట్లు రిలీజ్ చేసినట్లు తెలిసింది. ఆ డబ్బును విత్‌డ్రా చేయాలంటే కమిషన్‌కు ప్రత్యేకంగా ఓ అకౌంట్ ఆఫీసర్ అవసరం. ఇన్ని రోజుల పాటు అకౌంట్ ఆఫీసర్‌ను కేటాయించకపోవడంతో ఆ నిధులను డ్రా చేయలేకపోయారు. ఈ మధ్యే ఓ ఆఫీసర్‌ను అపాయింట్ చేసినట్లు తెలుస్తున్నది. చైర్మన్, సభ్యులకు విడివిడిగా స్టాఫ్‌ కేటాయించాలని కమిషన్ పెట్టిన ప్రపోజల్‌ను వ్యవసాయశాఖ నిరాకరించింది. ఇష్టం ఉన్నట్లు సిబ్బందిని సమకూర్చడం సాధ్యంకాదని, కమిషన్ యాక్టివిటీస్ కోసం ఐదుగురు సభ్యులను మాత్రమే ఇస్తామని స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది.

జిల్లా టూర్లతో హడావుడి..

కమిషన్ సభ్యులు జిల్లాల పర్యటనల పేరుతో హడావుడి చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఈ మధ్య ఓ కమిషన్ మెంబర్ ఓ జిల్లా పర్యటనకు వెళ్లారు. మార్గమధ్యంలో తమకు ఇష్టం ఉన్న చోట కారు ఆపి అక్కడికి ఆ ప్రాంత వ్యవసాయ శాఖ అధికారులను రమ్మని అదేశిస్తే సడన్‌గా ఎలా వెళ్తారు? అని అగ్రికల్చర్ శాఖ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కాగా, కొందరు జిల్లా పర్యటనలో తమకు సరైన ప్రొటోకాల్ ఇవ్వడం లేదని కమిషన్ సభ్యులు చిరాకు పడుతున్నట్లు తెలిసింది.

బాత్ రూమ్స్ లేక అవస్థలు..

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాలయాన్ని బీఆర్‌కే భవన్‌లో ఏర్పాటు చేయగా.. అక్కడ సరైన చాంబర్లు లేక చైర్మన్, మెంబర్లు అవస్థలు పడుతున్నట్లు తెలుస్తోంది. చివరికి బాత్రూంలకు డోర్లు లేవని, మహిళా సభ్యులు ఇబ్బందులు పడుతున్నట్టు టాక్. ఈ విషయంపై కాంగ్రెస్ లీడర్లు ఆవేదన చెందుతున్నట్లు తెలిసింది.

Next Story