‘రైతు భరోసా’ లబ్ధిదారులు @ 7.32 లక్షలు.. నల్లగొండ జిల్లాకే అత్యధిక సాయం

by Kema Shiva Kumar |

తెలంగాణలో రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్య 50.25 లక్షల నుంచి 73.32 లక్షలకు చేరింది.

‘రైతు భరోసా’ లబ్ధిదారులు @ 7.32 లక్షలు.. నల్లగొండ జిల్లాకే అత్యధిక సాయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో 2018లో ప్రారంభమైన రైతు బంధు పథకం లబ్ధిదారుల సంఖ్య ఏటేటా పెరుగుతుంది. కేసీఆర్ ​ప్రవేశపెట్టిన పథకం నేటికి ఏలాంటి అటంకాలు లేకుండా కొనసాగుతోంది. తొలిసారి 2018–19 వానకాలంలో సీజన్​లో 50.25 లక్షల మంది లబ్దిదారులు ఉండగా వారి ఖాతాల్లో రూ.5236 కోట్లు జమ చేశారు.2020–21 నాటికి క్రమంగా పెరిగి వానాకాలంలో సీజన్​లో 58.02 లక్షల పట్టాదారులకు రూ.7288 కోట్ల పంపిణీ చేయగా, యాసంగి పంటకాలానికి 59.32 లక్షల మంది రూ.7367 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. ప్రారంభంలో ఎకరానికి రూ. 8 వేలు ఇవ్వగా, తరువాత రూ.10 వేలకు పెంచారు. 2023లో రేవంత్​రెడ్డి ప్రభుత్వం కొలువు దీరిన తరువాత ఎకరానికి పెట్టుబడి సాయం రూ.12 వేలకు పెరిగింది. నేటికి రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్య 73.32 లక్షలకు చేరగా అర్హులైన రైతులకు ప్రభుత్వం రూ. 9 వేల కోట్లు ఖాతాలో వేస్తుంది. బీఆర్​ఎస్ ​ప్రభుత్వ పాలనలో ప్రతి సీజన్​కు చెందిన నగదు ఒకేసారి జమ అయ్యేది. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఆర్థిక పరిస్ధితుల కారణంగా ఎకరం చొప్పున దశల వారీగా భరోసా అందజేస్తుంది. దీనికి తోడు 19 సంవత్సరాల వయస్సు నుంచి 59 వయస్సు కలిగిన రైతులు మరణిస్తే రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పించింది. దీంతో ఐదు ఎకరాలకు భూమి పైబడిన రైతులంతా తమ కుటుంబాలకు పట్టాలు చేసి పెట్టుబడి సాయంతో పాటు, బీమా పొందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పథకం ప్రవేశ పెట్టిన నాలుగేళ్ల వరకు ఏటా కొత్త రైతులు 8 నుంచి 10 శాతం పెరిగినట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఎకరం భూమి కలిగిన సంఖ్య 26.55 లక్షలు ఉండగా, రెండు ఎకరాలు ఉన్న రైతులు 17.72 లక్షల మంది, మూడు ఎకరాల రైతులు 10.68 లక్షల మంది, నాలుగు ఎకరాలు 6.39 లక్షల మంది, ఐదు ఎకరాల కలిగిన అన్నదాతలు 4,41 లక్షల మంది ఉన్నారు. వీరంతా ఇప్పటికే ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం పొందారు.

నల్లగొండనే టాప్​..

రైతు బంధు పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటివరకు నల్లగొండ జిల్లా టాప్​లో ఉంది. 2018–19లో 4,19,723 రైతులు సాయం అందుకున్నారు. రెండవ స్థానంలో మహబూబ్​నగర్​3,34,957 మంది, మూడో స్ధానంలో సంగారెడ్డి 3,16,137 మంది రైతులు, నాల్గొవ స్థానంలో ఖమ్మం జిల్లా 2,64,724 మంది, ఐదో స్థానంలో నాగర్​కర్నూల్​ 2,63,125 మందికి పెట్టుబడి సాయం అందింది. భరోసా తీసుకునే అత్యధిక మంది రైతులు నల్లగొండ జిల్లాలోనే ఉన్నారు. ప్రస్తుతం ఈ జిల్లాలో 5.49 లక్షల మంది పెట్టుబడి సాయం అందుకుంటున్నారు. తరువాత సంగారెడ్డి జిల్లా 3.69 లక్షల రైతులు, ఖమ్మం జిల్లా 3.52 లక్షల మంది రైతులు, సిద్దిపేట 3.38 లక్షలు మంది, నాగర్​కర్నూల్​3.15 లక్షల మంది, కామారెడ్డి 3.20 లక్షలు ఉన్నట్లు వ్యవసాయశాఖ గణాంకాలు వెల్లస్తున్నాయి. రేవంత్​ సర్కార్​ పంపిణీ చేసే రైతు భరోసా ఈ జిల్లాలోని రైతులకే సగం వరకు జమ కానున్నాయి. కొత్త పట్టాదారు పాసు బుక్​ కలిగిన రైతులు నల్లగొండ, ఖమ్మం, సంగారెడ్డి, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల నుంచే అధికంగా దరఖాస్తులు చేసుకున్నట్టు తెలుస్తోంది.

పట్టాదారులకే డబ్బులు..

గతంలో సాగు చేయని రైతులు అదే గ్రామంలో సన్న, చిన్నకారులకు భూమి కౌలు ఇచ్చేవారు. వర్షాలు అదికంగా కురిసి పంటలు బాగా పండిస్తే ఆశించిన విధంగా కౌలు డబ్బులు వచ్చేవి. కరువు ఏర్పడితే నష్టపోయామని చాలా మంది కౌలు రైతులు కౌలు డబ్బులు ఎగనామం పెట్టేవారు. కేసీఆర్​అదికారం చేపట్టిన తరువాత రైతు బంధు ప్రవేశపెట్టడంతో పట్టాలు కలిగిన రైతులకు పంట పెట్టుబడి సాయం, మరో వైపు కౌలు రైతుల నుంచి డబ్బులు వస్తున్నాయి. దీంతో రెండు వైపు భూమి కలిగిన రైతులకు లాభం కలుగుతుంది. రైతు బంధు ప్రవేశపెట్టిన తరువాత తెలంగాణ రాష్ట్రంలో పెద్దగా కరువు రాలేదు. కల్లాలో రైతులు ధాన్యం రాశులు పోసి ప్రభుత్వం కొనుగోలు చేయాలని ధర్నాలు చేసిన సందర్భాలు అనేకం.

Next Story