- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏఐతో కొత్త ఎత్తు.. సెలబ్రిటీ వీడియోలు చూసి మోసపోవద్దు!
టెక్నాలజీ అనేది మానవాళి అభివృద్ధికి ఉపయోగపడాలి.. కానీ అదే టెక్నాలజీ సైబర్ నేరగాళ్ల చేతిలో పడి సామాన్యుల పాలిట శాపంగా మారుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: టెక్నాలజీ అనేది మానవాళి అభివృద్ధికి ఉపయోగపడాలి.. కానీ అదే టెక్నాలజీ సైబర్ నేరగాళ్ల చేతిలో పడి సామాన్యుల పాలిట శాపంగా మారుతోంది. మొన్నటి వరకు గుర్తు తెలియని లింకులు పంపి, ఫోన్ చేసి ఓటీపీలు అడిగి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసిన సైబర్ కంత్రీలు.. ఇప్పుడు రూటు మార్చారు. సామాన్యుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టెక్నాలజీ సాయంతో డీప్‌ఫేక్ వల విసురుతున్నారు. ప్రముఖులు, సెలబ్రిటీలు మాట్లాడుతున్నట్లుగానే నకిలీ వీడియోలు సృష్టించి ఆర్థిక మోసాలకు తెరలేపారు.
మోసగాళ్ల బ్రహ్మాస్త్రం
సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఆధునిక సాంకేతికతను వాడుతున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ తదితర సామాజిక మాధ్యమాల్లో స్పాన్సర్డ్ యాడ్స్ రూపంలో డీప్‌ఫేక్ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. దేశంలో కుబేరులైన వ్యాపారవేత్తలు, ప్రముఖ టీవీ యాంకర్లు, స్టార్ క్రికెటర్లు, సినీ హీరోలు.. గతంలో ఏదైనా టీవీ షో లో ఇచ్చిన ఇంటర్వ్యూల ఒరిజినల్ వీడియోలను నేరగాళ్లు సేకరిస్తారు. అందులోని వారి ముఖ కవళికలు, పెదాల కదలికలను లిప్ సింక్ ఏఐ డీప్‌ఫేక్ టెక్నాలజీతో మార్చేస్తారు. దానికి తోడు వాయిస్ క్లోనింగ్ సాఫ్ట్‌వేర్ ద్వారా అచ్చం వారి గొంతును అనుకరిస్తారు. అంటే, ప్రముఖులు ఒకప్పుడు మాట్లాడిన వీడియోకు.. నేరగాళ్లు తమకు కావాల్సిన డైలాగులను జోడించి వారే మాట్లాడుతున్నట్లుగా నకిలీ వీడియోలను సృష్టిస్తారు.
సామాన్యుల నమ్మకమే పెట్టుబడి..
‘నేను ఈ కొత్త యాప్ ద్వారా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి రూ.కోట్లు సంపాదించాను. నా పర్సనల్ సీక్రెట్ ఇదే. నా ఫాలోవర్ల కోసం ఈ యాప్ లింక్ ఇస్తున్నాను. మీరు తక్కువ సమయంలో భారీ లాభాలు పొందొచ్చు. నా మాట నమ్మి ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.’ అంటూ సెలబ్రిటీలు నేరుగా ప్రజలకు చెబుతున్నట్లుగా ఆ వీడియోల్లో కనిపిస్తుంది. ఈ వీడియోలను చూసినప్పుడు, తమ అభిమాన హీరోనో లేదా దేశంలోనే పేరున్న వ్యాపారవేత్తో స్వయంగా పెట్టుబడి చిట్కాలను చెబుతున్నారని గుడ్డిగా నమ్మేస్తున్నారు. టీవీల్లో చూసే ప్రముఖులే చెబుతున్నారు కదా అని ఆ వీడియో కింద నేరగాళ్లు ఇచ్చే లింక్‌ను క్లిక్ చేసి నకిలీ ట్రేడింగ్ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.
అప్పులు చేసి మరీ పెట్టుబడి..
సెలబ్రిటీల వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేయగానే యూజర్లు వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూపుల్లోకి యాడ్ అవుతారు. అక్కడ సైబర్ నేరగాళ్లు ఆ సెలబ్రిటీకి చెందిన మేనేజర్లుగా లేదా స్టాక్ మార్కెట్ నిపుణులుగా పరిచయం చేసుకుంటారు. వారు పంపిన నకిలీ ట్రేడింగ్ యాప్‌లో తొలుత పది వేలు పెట్టుబడి పెట్టగానే.. రెండు రోజుల్లో ఆ యాప్ డ్యాష్‌బోర్డులో అది రూ.50 వేలు అయినట్లుగా కనిపిస్తుంది. ఇది నిజమేనని నమ్మిన యూజర్లు.. అత్యాశతో లక్షలాది రూపాయలు పెట్టుబడిగా పెడుతున్నారు. అప్పులు చేసి మరీ అందులో పోస్తున్నారు. కొన్ని రోజులకు యాప్‌లో వారి పెట్టుబడి ఏకంగా కోట్ల రూపాయలకు చేరినట్లు కనిపిస్తుంది. కానీ, ఆ డబ్బును తమ బ్యాంకు ఖాతాలోకి విత్‌డ్రా ప్రయత్నించినప్పుడు అసలు కథ మొదలవుతుంది. మీ డబ్బు విత్‌డ్రా కావాలంటే 30 శాతం ట్యాక్స్ కట్టాలని, ప్రాసెసింగ్ ఫీజులు కట్టాలని నేరగాళ్లు అదనంగా డబ్బులు వసూలు చేస్తారు. విత్‌డ్రా మాత్రం కానివ్వరు. చివరికి ఫోన్ నంబర్లు బ్లాక్ చేసి పరారవుతారు. అప్పుడు తాము నిలువునా మోసపోయామని బాధితులు గ్రహిస్తున్నారు.
ప్రతి వీడియోను నమ్మకండి..
‘‘సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వీడియోను నమ్మకండి. ఆ వీడియోల్లో ప్రముఖులు ఇచ్చే పెట్టుబడి సూచనలు, చిట్కాలను అసలే పాటించవద్దు. ఏ సెలబ్రిటీ పనిగట్టుకుని ఒక గుర్తుతెలియని యాప్‌లో పెట్టుబడులు పెట్టాలని అడగరు. ఇది కచ్చితంగా డీప్‌ఫేక్ స్కామ్ అని గుర్తించాలి. ఇలాంటి ఫేక్ వీడియోలు మీ దృష్టికి వస్తే వాటిని నమ్మకపోవడమే కాదు.. వేరే వారికి షేర్ చేయవద్దు. మీరు షేర్ చేయడం వల్ల అది నిజమే అని నమ్మి నేరగాళ్ల వలలో మరింత మంది చిక్కుకునే ప్రమాదం ఉంది. సైబర్ మోసాల బారిన పడి డబ్బులు కోల్పోతే.. వెంటనే గోల్డెన్ అవర్‌లో 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలి. లేదా www.cybercrime.gov.in జాతీయ సైబర్ క్రైమ్ వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలి.’’
- శిఖా గోయల్, డైరెక్టర్, టీజీసీఎస్‌బీ






