ఆర్టీసీ కార్మికులు దుర్భర జీవితం గడుపుతుండ్రు.. కేంద్ర మంత్రి బండి సంజయ్

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-24 05:55:39  IST  )

ఆర్టీసీ కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు.

ఆర్టీసీ కార్మికులు దుర్భర జీవితం గడుపుతుండ్రు.. కేంద్ర మంత్రి బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఆర్టీసీ (RTC) కార్మికులు అత్యంత దుర్భర జీవితం గడుపుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఇచ్చిన మాటను ఇప్పటికైనా నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 'అభయహస్తం' పేరుతో మేనిఫెస్టో విడుదల చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పాటై 900 రోజులు గడుస్తున్నా.. హామీల అమలు ఏమైందని ఆయన ప్రశ్నించారు. 100 రోజుల్లోనే హామీలను అమలు చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించి, ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యల విషయంలో కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుండటం దారుణమని బండి సంజయ్ అన్నారు. కార్మికులెవరూ సంయమనం కోల్పోవద్దని, ప్రాణాలు తీసుకోవద్దని ఆయన ధైర్యం చెప్పారు. ‘ఢిల్లీకి మూటలు అప్పగించేందుకు ప్రభుత్వం వద్ద దండిగా డబ్బులు ఉన్నాయి కానీ.. కార్మికులకు మంచి చేసేందుకు చేతులు రావడం లేదా?’ అని ఆయన నిప్పులు చెరిగారు. ఎన్నికలు జరుగుతున్న ఇతర రాష్ట్రాలకు తెలంగాణ నుంచి నిధులు వెళ్తున్నాయని, ఇక్కడి నుంచి డబ్బులు పంపితే తప్ప కాంగ్రెస్ పార్టీ నడవదని బండి సంజయ్ కామెంట్ చేశారు.

Next Story