తెలంగాణలో ఆర్టీసీ సమ్మె.. 40 వేల మంది కార్మికుల అల్టిమేటం

by Ramesh Naini |   (  Updated:2026-04-13 15:20:02  IST  )

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం, యాజమాన్యం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా సమ్మె సైరన్ మోగింది.

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె.. 40 వేల మంది కార్మికుల అల్టిమేటం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం, యాజమాన్యం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా సమ్మె సైరన్ మోగింది. సోమవారం సాయంత్రం లేబర్ కమిషనర్‌తో జేఏసీ నాయకులు జరిపిన చర్చలు విఫలం కావడంతో, ఈ నెల 22వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న స్పష్టం చేశారు. మార్చి 13నే తాము సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ.. నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం తీరు కార్మికులను బలవంతంగా సమ్మెలోకి నెట్టేలా ఉందని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ కార్యాలయం బయట మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించిన కమిటీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్టీసీ విలీనం, యూనియన్ ఎన్నికల కోసం కమిటీ వేశామని మంత్రి చెబుతున్నారని, అయితే ఆ కమిటీకి చైర్మన్ ఎవరు? దానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఏవి? అన్న విషయాలను ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కొత్త డిమాండ్లు ఏవి అడగడం లేదని, కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే నెరవేర్చాలని కోరుతున్నామని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి సమస్యలను విన్నవిస్తున్నా పట్టించుకోకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సుల వల్ల సంస్థ కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని అందువల్ల వాటిని ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు. ప్రభుత్వం సమ్మె నివారణ చర్యలు చేపట్టాలని జేఏసీ వైస్‌ఛైర్మన్‌ థామస్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం, యాజమాన్యం ముందు 32 డిమాండ్లు పెట్టామని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇవ్వాలన్నారు.

21 అర్ధరాత్రి నుంచే సమ్మె..

ఈ సమ్మె ప్రభావం ఏప్రిల్ 21 అర్ధరాత్రి నుంచే ప్రారంభం కానుందని జేఏసీ ప్రకటించింది. 22వ తేదీ మొదటి డ్యూటీ నుంచి ఏ ఒక్క కార్మికుడు విధులకు హాజరు కాకూడదని పిలుపునిచ్చింది. దాదాపు 40 వేల మంది కార్మికులు జేఏసీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని, ఎవరైనా వేరే ఆలోచనలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది. ఖాళీగా ఉన్న అన్ని కేటగిరీ పోస్టులను భర్తీ చేయాలని, కార్మికులను ఎక్కడ ఉన్న వారిని అక్కడే కొనసాగించాలని కోరింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా తక్షణమే చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జేఏసీ డిమాండ్ చేసింది.

గత నెల 13వ తేదీనే నోటీసులు..

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్​తో జేఏసీ నేతలు మార్చి 13వ తేదీనే సమ్మె నోటీసులు ఇచ్చారు. లేబర్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి సమ్మె నోటీసులు అందజేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే చేపట్టాలని యూనియన్​ నాయకులు డిమాండ్‌ చేశారు. 2021 వేతన సవరణ 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని, మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెలా మహాలక్ష్మి పథకం కింద ఇచ్చే రూ.350 కోట్లలో ఎలాంటి కోతలు, షరతులు లేకుండా సక్రమంగా విడుదల చేయాలని వారు గతంలో సమ్మె నోటీసు ఇచ్చిన సందర్భంగా పేర్కొన్నారు

Next Story