- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RTC Strike: డ్రైవర్ ఆత్మహత్యాయ్నంపై జేఏసీ సీరియస్.. 29 వరకు కార్యాచరణ ప్రకటన
నర్సంపేట డిపో డ్రైవర్ ఆత్మహత్యా ప్రయత్నానికి ప్రభుత్వానిదే బాధ్యత అని జేఏసీ ఆరోపించింది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని చేసిన ఆత్మహత్నానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేసింది. సమ్మె డిమాండ్ల పరిష్కారం విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన అబద్ధాలు, ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లాగే సమస్యలను పరిష్కరించడానికి మొండి వైఖరి అవలంబిస్తున్నందుకు తట్టుకోలేక శంకర్ గౌడ్ మనోవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించింది. ఈ మేరకు ఇవాళ ఆర్టీసీ జేఏసీ అత్యవసర సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. ఈ కార్యక్రమాలను అన్ని డిపోలకు చెందిన JAC నాయకులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.
ఎంత మంది బలిదానాలు కావాలి:
ఆత్మహత్యాయత్నం చేసిన శంకర్ గౌడ్ 70 శాతం కాలిన గాయాలతో వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‍లో చికిత్స పొందుతున్నాడని ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడని జేఏసీ తెలిపింది. ఈ దుర్ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన జేఏసీ.. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 34 మంది ఆర్టీసి కార్మికులు ఆత్మబలిదానం చేసుకుంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమంది ఆర్టీసి కార్మికులు బలిదానాలు చేసుకుంటే దిగివస్తుందో చెప్పాలని ప్రశ్నించింది. ఇప్పటివరకు శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా సమ్మె చేస్తున్న ఆర్టీసి కార్మిక వర్గంపై ఉక్కుపాదం మోపుతూ, డిపోలలో వేసుకున్న టెంట్లను పోలీసులతో కూల్చివేయించి అక్కడినుండి నిర్దాక్షిణ్యంగా కార్మికులను తరిమి కొడుతున్నారని ఇదేనా ప్రజాపాలన అని ముఖ్యమంత్రిని జేఏసీ ఛైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ ఛైర్మన్ ఎం.థామస్ రెడ్డి, కన్వీనర్ ఎండి.మౌలానా, కో కన్వీనర్లు సుద్దాల సురేష్, కత్తుల యాదయ్య, బి.యాదగిరి ప్రశ్నించారు.
ఆత్మహత్యలు వద్దు:
నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్‍కు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా వెంటనే మెరుగైన వైద్యం అందించాలని జేఏసీ డిమాండ్ చేసింది. ఈ ఆత్మహత్య సంఘటనకు ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వాలే బాధ్యత వహించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి స్పందించాలని కోరింది. సమ్మె డిమాండ్లను పరిష్కరించి, సమ్మెను విరమింపచేయాలని కోరుతూ అన్ని డిపోలలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని తొలగించి కార్మికులకు ప్రశాంత వాతావరణం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మికవర్గమంతా క్షణికావేశానికిలోను కాకుండా ఎలాంటి అఘాయిత్యాలు చేసుకోవద్దని, ధైర్యంగా ఉండాలని సూచించింది. ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని ఐకమత్యంతో మనమంతా కొట్లాడి మన డిమాండ్లను సాధించుకోవడానికి జేఏసీ కృత నిశ్చయంతో ఉందని జేఏసీ పట్ల విశ్వాసంతో ఉండాలని కోరింది.
భవిష్యత్ కార్యాచరణ:
-24 ఏప్రిల్ అన్ని డిపోల ముందు మౌన ప్రదర్శనలు
-25 ఏప్రిల్ అన్ని డిపోలలో వంటావార్పు
-26 ఏప్రిల్ అన్ని రీజియన్‍లలో, జిల్లాలలో కార్మిక కవాత్
-27ఏప్రిల్ తెలంగాణ MLA, MLC, MP, మంత్రులకు, వినతిపత్రాలు
-28 ఏప్రిల్ మహిళ ఉద్యోగులతో అన్ని డిపోలలో బతుకమ్మలతో నిరసన ప్రదర్శనలు
-29ఏప్రిల్ అన్ని డిపోల ముందు అర్ధనగ్న ప్రదర్శనలు






