- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ విలీనం వెంటనే పూర్తి చేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్‌కు జేఏసీ విజ్ఞప్తి
ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రభుత్వం అంగీకరించిన డిమాండ్ల మేరకు విలీన ప్రక్రియను తక్షణమే పూర్తి చేసి, 'అపాయింటెడ్ డేట్' ప్రకటించాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రభుత్వం అంగీకరించిన డిమాండ్ల మేరకు విలీన ప్రక్రియను తక్షణమే పూర్తి చేసి, 'అపాయింటెడ్ డేట్' ప్రకటించాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం. థామస్ రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కో-కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్, బి. యాదగిరి తదితరులు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విలీన ప్రక్రియలో జేఏసీ సూచించిన విధివిధానాలను పరిగణనలోకి తీసుకోవాలని, వెంటనే విలీన ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. సమ్మె చర్చల సమయంలో మంత్రుల కమిటీ, ఐఏఎస్ అధికారుల కమిటీతో కార్మిక సంఘాలు చర్చించి అంగీకరించిన అంశాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. విలీనం అంశాన్ని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, వారి ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
వేతన సవరణపై ఆదేశాలు..
2021 వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. అలాగే అన్ని డిపోల్లో అధికారులు కార్మిక సంఘాల పట్ల స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
త్వరలో ముఖ్యమంత్రితో భేటీ..
మంత్రితో భేటీ అనంతరం జేఏసీ నాయకులు అత్యవసర సమావేశం నిర్వహించారు. విలీన ప్రక్రియలో జాప్యం జరగకుండా చూడాలని కోరుతూ త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.






