TGSRTC: గుడ్ న్యూస్.. త్వరలో అయోధ్య, వారణాసికి ఆర్టీసీ టూర్ ప్లాన్‌లు : ఎండీ వీసీ స‌జ్జనార్

by Ramesh Naini |

ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన అయోధ్య, వారాణాసి, త‌దిత‌ర టూర్ ప్యాకేజీల‌ను అందుబాటులోకి తీసుకురావాల‌ని అధికారుల‌కు ఎండీ వీసీ స‌జ్జనార్ సూచించారు.

TGSRTC: గుడ్ న్యూస్.. త్వరలో అయోధ్య, వారణాసికి ఆర్టీసీ టూర్ ప్లాన్‌లు : ఎండీ వీసీ స‌జ్జనార్
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) సేవ‌ల‌ను మ‌రింత‌గా ప్రజ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని విలేజ్, కాలనీ బ‌స్ ఆఫీస‌ర్‌ల‌కు సంస్థ ఎండీ వీసీ స‌జ్జనార్ (MD VC Sajjanar) సూచించారు. సామాజిక బాధ్యత‌గా వినూత్న ఆలోచ‌న‌తో ఇటీవ‌ల ప్రారంభించిన యాత్రాదానం ప్రాధాన్యత‌ను వివ‌రించడంతో పాటు పెళ్లిళ్లు, శుభ‌కార్యాల‌కు అద్దె బ‌స్సుల బుకింగ్, కార్గో సేవ‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. వ్యక్తుల ప్రత్యేకమైన, ఆనందదాయకమైన రోజుల్లో అనాథ‌లు, నిరాశ్రయులైన వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులను ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల‌కు, పర్యాటక ప్రాంతాలకు, విహార‌యాత్రల‌కు యాత్రదానంలో భాగంగా తీసుకెళ్లేందుకు డిపోల‌ వారీగా కార్యాచ‌ర‌ణ రూపొందించుకోవాల‌ని సూచించారు. ఆర్టీసీ యాత్రాదానం కార్యక్రమానికి దాత‌లు ముందుకు వ‌స్తుండ‌టం అభినంద‌నీయ‌మ‌న్నారు.

హైద‌రాబాద్ బాగ్ లింగంప‌ల్లిలోని ఆర్టీసీ క‌ళాభ‌వ‌న్‌లో శ‌నివారం రాష్ట్రస్థాయి విలేజ్, కాల‌నీ బ‌స్ ఆఫీస‌ర్ల స‌మావేశం జ‌రిగింది. ఉన్నతాధికారుల‌తో క‌లిసి రీజియ‌న్ల వారీగా వారి నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లను సజ్జనార్ స్వీక‌రించారు. క్షేత్రస్థాయిలో ఉన్న స‌మ‌స్యలను అడిగి తెలుసుకున్నారు. విలేజ్, కాల‌నీ బ‌స్ ఆఫీస‌ర్ల ప‌నితీరును ఎండీ మెచ్చుకున్నారు. ఈ ఆర్థిక ఏడాదిలో 21 వేల‌కు పైగా అద్దెకు బ‌స్సుల‌ను బుకింగ్ చేశార‌ని, ఇందులో ప్రతి ఒక్కరి కృషి ఉంద‌ని అభినందించారు. రాబోయే రోజులు సంస్థకు ఎంతో కీల‌క‌మ‌ని, బ‌తుక‌మ్మ, ద‌సరా, దీపావ‌ళి, క్రిస్మస్ తో పాటు సంక్రాంతి పండుగ‌కు ఇదే స్పూర్తితో విధులు నిర్వర్తించాల‌ని సూచించారు. టీజీఎస్ఆర్టీసీ ఇటీవ‌ల ప్రవేశ‌పెట్టిన టూర్ ప్యాకేజీల‌కు ప్రజ‌ల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంద‌ని తెలిపారు. త్వర‌లోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన అయోధ్య, వారాణాసి, త‌దిత‌ర టూర్ ప్యాకేజీల‌ను అందుబాటులోకి తీసుకురావాల‌ని అధికారుల‌కు సూచించారు.

Next Story