తెలంగాణ మహిళలకు గుడ్‌న్యూస్.. ఆధార్ కార్డు లేకున్నా బస్సుల్లో ప్రయాణం!

by Gantepaka Srikanth |

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం రాష్ట్ర సామాజిక, ఆర్థిక ముఖచిత్రంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.

తెలంగాణ మహిళలకు గుడ్‌న్యూస్.. ఆధార్ కార్డు లేకున్నా బస్సుల్లో ప్రయాణం!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం రాష్ట్ర సామాజిక, ఆర్థిక ముఖచిత్రంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. మహిళా సాధికారత లక్ష్యంగా ప్రారంభమైన ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళల రవాణా ఛార్జీల మొత్తం నేటితో రూ.10,000 కోట్ల మార్కును చేరుకుందని TGSRTC అధికారికంగా ప్రకటించింది. 2023 డిసెంబర్ 9న పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు (29.03.2026) (సుమారు 28 నెలల కాలంలో) రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 290 కోట్లకు పైగా జీరో (ఉచిత ప్రయాణం) టికెట్లను మహిళా ప్రయాణికులు వినియోగించుకున్నట్లు రవాణా శాఖ ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు. గతంలో రవాణా ఛార్జీల కోసం నెలకు సగటున రూ. 1,500 నుండి రూ. 2,500 వరకు వెచ్చించే సామాన్య, మధ్యతరగతి మహిళలు, విద్యార్థినులు, కూలీలు ఇప్పుడు ఆ మొత్తాన్ని పొదుపు చేసుకుంటున్నారని, ఈ పొదుపు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా రూ. 10,000 కోట్లకు చేరడం మహిళల ఆర్థిక స్వావలంబనకు నిదర్శనంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.

10 వేల కోట్లు ఆదా..

మహాలక్ష్మి అమలు తరువాత ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని, పథకం రాకముందు 40 శాతంగా ఉన్న మహిళల వాటా, ప్రస్తుతం 67 శాతానికి పైగా నమోదవుతోందని, ప్రతిరోజూ సగటున 35 లక్షల మందికి పైగా మహిళలు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నట్లు ఎండీ వెల్లడించారు. మహిళలు ఉచితంగా ప్రయాణించిన టిక్కెట్ల విలువను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ రూపంలో ఆర్టీసీకి చెల్లిస్తోంది. తద్వారా ఆర్టీసీ ఆర్థిక బలోపేతం, సిబ్బంది జీతభత్యాలు, ఇతర నిర్వహణ ఖర్చులకు ఈ నిధులు కొంత వెసలుబాటును కల్గిస్తున్నాయని ఎండీ నాగిరెడ్డి స్ఫష్టం చేశారు. ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం ప్రారంభమైందని, ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో మహిళా సాధికారత దిశగా అడుగులు పడుతున్నాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. మహాలక్ష్మి ద్వారా ఇప్పటి వరకు దాదాపు 290 కోట్ల మహిళా ఉచిత ప్రయాణాలు పూర్తి చేసుకొని మహిళలు 10వేల కోట్లు ఆదా చేసుకున్న సందర్భంగా మహిళలకు మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.

290 కోట్ల ఉచిత ప్రయాణాలు..

అనతి కాలంలోనే 290 కోట్ల ఉచిత ప్రయాణాలతో 10 వేల కోట్ల రూపాయలు ఆదా చేసుకున్న మహిళా ప్రయాణికుల కోసం నిరంతరం కృషి చేస్తున్న టీజీఎస్ ఆర్టీసీ సిబ్బందికి మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలియజేశారు. మహాలక్ష్మి ద్వారా మహిళలు ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకొని నిత్యం ఆర్టీసీ బస్సుల్లో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఉచితంగా ప్రయాణం చేస్తూ ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నారన్నారు. మహిళలు చిన్న చిన్న గ్రామాల నుండి పట్టణాలకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారని, గ్రామాల నుండి నాణ్యమైన వైద్యం కోసం హైదరాబాదులో చికిత్స చేసుకుంటున్నారని, కుటుంబంతో కలిసి దేవాలయాలకు వెళ్తున్నారని ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలకు పెద్ద పీట వేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

“స్మార్ట్ కార్డుల’’ జారీ..

మహాలక్ష్మి పథకాన్ని మరింత సరళతరం చేసేందుకు, కచ్చితమైన గణాంకాల కోసం త్వరలో చిప్ ఆధారిత స్మార్ట్ కార్డుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఎండీ నాగిరెడ్డి చెప్పారు. ఆధార్ కార్డు చూపించాల్సిన అవసరం లేకుండానే స్మార్ట్‌ కార్డులు ద్వారా మహిళల ఉచిత ప్రయాణం చేసేందుకు ఈ విధానం ఎంతగానో దోహదపడనుందని, పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను ప్రవేశపెట్టడం జరుగుతోందని ఎండీ స్ఫష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర మహిళలకు గౌరవప్రదమైన, సురక్షితమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంలో భాగస్వాములైనందుకు TGSRTC గర్విస్తోందని సంస్థ వీసీ అండ్‌ ఎండీ వై.నాగిరెడ్డి అన్నారు. ఈ పథకం విజయవంతానికి సహకరిస్తున్న ప్రయాణికులకు, నిధులు విడుదల చేస్తున్న ప్రభుత్వానికి సంస్థ తరఫున కృతజ్ఞతలు చెప్పారు. ఈ పథకం పల్లెవెలుగు (3278), డిస్ట్రిక్ట్ ఎక్స్ప్రెస్ (2039), సిటీ ఆర్డినరీ (1829) మరియు సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్ (1044) బస్సులలోని మొత్తం బస్సులలో 81% వర్తిస్తుందని వివరించారు. బాలికలు ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉత్తమ, ఉన్నత విధ్యను అభ్యసించేందుకు బాలికలకు ఈ ఉచిత ప్రయాణం ఎంతో దోహదపడుతుందని, తెలంగాణలోని ప్రతి మహిళలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా పది వేల కోట్ల రూపాయల రవాణా ఛార్జీలను ఆదా చేసుకోవడం ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తోందని అభివర్ణించారు. ఇది కేవలం ఉచిత ప్రయాణం కాదు, రాష్ట్ర ప్రగతిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే ఒక మహా యజ్ఞమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం సహాయ, సహకారాలతో సంస్థ అభ్యున్నతి సాధ్యమవుతుందని, ప్రయాణికులు ప్రజా రవాణా వ్యవస్థను ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.

Next Story