భయం భయంగా పనిచేస్తున్నాం.. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ల ఆవేదన

by Gantepaka Srikanth |

భయం భయంగా పనిచేస్తున్నాం.. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ల ఆవేదన

భయం భయంగా పనిచేస్తున్నాం.. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ల ఆవేదన
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఆర్టీసిలో పని చేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు తమ విధి నిర్వహణలో అనేక ఇబ్బందులు పడుతున్నారని.. డ్యూటీ చేయాలంటే భయభ్రాంతులకు గురవుతూ అభద్రతా భావానికి లోనవుతున్నారని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) వాపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణీకులతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. కొన్ని సందర్భాలలో తీవ్రమైన వాగ్వివాదాలు జరిగి మహిళలు డ్రైవర్ కండక్టర్లపై చేయి చేసుకోవడం కూడా జరిగాయని ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. బస్సులో టికెట్ తీసుకుని ప్రయాణిస్తున్న మగ ప్రయాణికులు తమకు సీట్ లేదన్న కారణంగా డ్రైవర్లు, కండక్టర్లను దూషించటం నిత్యం జరుగుతోందని ఆయన వాపోయారు. మరికొందరు ప్రయాణీకులు స్టేజి లేకపోయినా తాము ఆపమన్న చోట బస్సులు ఆపలేదని డ్రైవర్లు, కండక్టర్లపై దాడికి దిగుతున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. రోడ్డు మీద వెళుతున్న వాహనదారులు కూడా తమకు సైడ్ ఇవ్వలేదన్న కారణంగా బస్సును ఆపి సిబ్బంది మీద దాడి చేసి విచక్షణా రహితంగా హింసిస్తున్నారని.. ఇలాంటి సందర్భంలోనే కొందరు సిబ్బంది గాయాల ప్రభావం వల్ల మెడికల్ అన్ ఫిట్ కూడా అయ్యారని తెలిపారు.

డ్రైవర్లు, కండక్టర్లు ఓవైపు చెకింగ్ అధికారులతో వచ్చే ఇబ్బందులతో భయం భయంగా ఉద్యోగం చేస్తున్న క్రమంలో పులి మీద పుట్ర లాగా ఈ ప్రయాణికుల దెబ్బలతో మరింత అభద్రతా భావానికి లోనవుతున్నామని అన్నారు. ఆర్టీసి యాజమాన్యం... కార్మికులకు విధి నిర్వహణలో ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించటాన్ని స్వాగతించారు. సైబర్ క్రైమ్స్ జరిగినప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ 1930 లాగా ఆర్టీసి సిబ్బందిపై దాడులు జరిగినప్పుడు ఆ క్రైమ్ ను తెలియజేయటానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసి సిబ్బందిపై జరిగిన దాడులను విచారించటానికి ఒక ఎస్.ఓ.టి ని ఏర్పాటు చేయాలని, ఈ కేసులను తక్షణమే విచారించి దోషులను శిక్షంచడానికి పత్యేక న్యాయ వ్యవస్థలను ప్రభుత్వం ప్రవేశ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Next Story