మందుబాబులకు షాక్.. 5,819 driving license cancelled

by Disha Web Desk |
మందుబాబులకు షాక్.. 5,819 driving license cancelled
X

దిశ, డైనమిక్ బ్యూరో : మద్యం తాగి వాహనాలు నడిపే మందుబాబులూ ఇక జాగ్రత్తగా ఉండాలి. నూతన సంవత్సరం వేళ మందుబాబులకు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. కొత్త సంవత్సరం రోజే కాదు.. ఎప్పుడైనా డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో చిక్కితే కేసులు, జరిమానాలతో పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ సైతం రద్దు అవుతోంది. మద్యం మత్తులో మందుబాబులు ప్రమాదాలకు కారణం అవుతుండటంతో రవాణాశాఖ ఈ విషయంపై దృష్టి సారించింది. ట్రాఫిక్‌ పోలీసుల నివేదికల ఆధారంగా ప్రత్యేక కోర్టులు జారీ చేసిన ఉత్తర్వులపై రవాణాశాఖ అధికారులు వేగంగా స్పందిస్తూ డ్రైవింగ్‌ లైసెన్సులు రద్దు చేస్తున్నారు.

గతేడాది(2022) జనవరి నుంచి డిసెంబరు వరకు 5,819 డ్రైవింగ్‌ లైసెన్సులను తాత్కాలిక/శాశ్వతంగా రద్దు చేశారు. హైదరాబాద్‌లోని ఆర్టీఏ పరిధిలో 5,819 డ్రైవింగ్ లైసెన్స్‌లు క్యాన్సిల్ చేసినట్లు జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాండురంగ నాయక్ తెలిపారు. డ్రంకన్ డ్రైవ్, యాక్సిడెంట్ వంటి కేసుల్లో ఆ లైసెన్స్‌లను రద్దు చేశామని ఆయన చెప్పారు. 2021 ఏడాదితో పోలిస్తే ఇది 3,220 అధికమని శనివారం ఓ ప్రకటనలో ఆయన వెల్లడించారు. హైదరాబాద్ పరిధిలో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్ జోన్‌లు ఉండగా ఈస్ట్ జోన్ మినహా మిగతా అన్ని జోన్లలో భారీగా లైసెన్స్‌లను రద్దు చేశామన్నారు. నార్త్ జోన్‌లో 1103, సౌత్‌లో 1151, ఈస్ట్‌లో 510, వెస్ట్ జోన్‌లో 1345 డ్రైవింగ్ లైసెన్స్‌లను క్యాన్సిల్ చేశామని వివరించారు.

'మద్యం మత్తులో వాహనదారులు ఎదుర్కొంటున్న ప్రమాదాలను నియంత్రించేందుకు డ్రైవింగ్‌ లైసెన్సులు రద్దు చేస్తున్నాం. దీంతో మందుబాబులు వాహనాలు నడిపేందుకు వీలుండదు. ఉద్యోగ అవకాశాల సమయంలో విద్యార్థులు, యువకులకు ఈ కేసులు తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. డ్రంకెన్‌ డ్రైవ్‌లో తొలిసారి పట్టుబడితే లైసెన్స్‌ తాత్కాలికంగా రద్దవుతుంది. తీవ్రత ఆధారంగా శాశ్వతంగానూ రద్దు చేయవచ్చు'అని పాండురంగ నాయక్‌ అన్నారు. కాగా, డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పట్టుబడుతున్న మందుబాబులకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేయాలని ట్రాఫిక్‌ పోలీసులు మూడు, నాలుగేళ్లుగా ప్రత్యేక కోర్టులను అభ్యర్థిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వాహనదారులు సూసైడ్‌ బాంబర్ల కంటే ప్రమాదం.. వారి లైసెన్సులు రద్దు చేయాలంటూ ఢిల్లీ కోర్టు కొన్నేళ్ల క్రితం వ్యాఖ్యానించడంతో పాటు మందుబాబుల డ్రైవింగ్‌ లైసెన్సులు రద్దు చేయాలని సూచించింది. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక కోర్టులు డ్రైవింగ్‌ లైసెన్సులు రద్దు చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి : Police Candidates కు బిగ్ అలర్ట్.. తుది పరీక్షల తేదీలు ఫిక్స్


Next Story